మూడో స్థానానికి ప‌డ్డా మార‌ని కాంగ్రెస్ తీరు!

మ‌ళ్లీ అదే క‌థే.. త‌మ దురావ‌స్థ నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేత‌లు బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోతున్న వైనం స్ప‌ష్టంగా గోచ‌రిస్తూ ఉంది. ప్ర‌త్యేక తెలంగాణ‌ను ఏర్ప‌రిచిన పార్టీగా అక్క‌డ రాణించే అవ‌కాశం ఉన్నా..…

మ‌ళ్లీ అదే క‌థే.. త‌మ దురావ‌స్థ నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేత‌లు బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోతున్న వైనం స్ప‌ష్టంగా గోచ‌రిస్తూ ఉంది. ప్ర‌త్యేక తెలంగాణ‌ను ఏర్ప‌రిచిన పార్టీగా అక్క‌డ రాణించే అవ‌కాశం ఉన్నా.. దాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి ఆ పార్టీ నేత‌ల‌కు ఏ మాత్రం ఆస‌క్తి క‌న‌ప‌డ‌టం లేదు.

ఆశ‌లు అయితే భారీగా ఉన్నాయి కానీ, అందుకు స‌మాయ‌త్తం అయ్యే తీరులోనే కాంగ్రెస్ లో ఎక్క‌డా నిజాయితీ క‌నిపించ‌దు. ప్ర‌జ‌లు తెలంగాణ రాష్ట్ర స‌మితికి ప్ర‌త్యామ్నాయాన్ని కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆ ప‌రిస్థితి ఉందేమో! అయితే ఆ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గ‌డంలో కాంగ్రెస్ పార్టీ అడుగ‌డునా విఫ‌లం అవుతూ ఉంది. అప్పుడేమో చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి కాంగ్రెస్ వాళ్లు దుంప‌నాశ‌నం అయ్యారు. 

కాంగ్రెస్ అలా పూర్తిగా ఫెయిల్ అయిన ప‌రిస్థితుల్లో బీజేపీ అవ‌కాశాన్ని మ‌లుచుకుంది. టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం తామే అని బీజేపీ రుజువు చేసుకుంది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అయినా, గ్రేట‌ర్ లో అయినా బీజేపీ ప్ర‌జ‌లకు తమ స్థానాన్ని స్ప‌ష్టంగా తెలియ‌జేసింది.

ఇక ఇప్ప‌టికే మూడో స్థానంలోకి ప‌డిన కాంగ్రెస్ పార్టీని మ‌రింత‌గా నాశ‌నం చేసేందుకు ఆ పార్టీ నేత‌లు కంక‌ణం క‌ట్టుకున్న వైనం స్ప‌ష్టం అవుతోంది. అధిష్టానానికి బుద్ధి లేదు, మిగ‌తా నాయ‌కుల‌కు జ్ఞానం లేదు అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి.

ఎవ‌రో ఒక‌రిని నాయ‌కుడిగా నియ‌మించేంత వ‌ర‌కూ ఒక లొల్లి, నియ‌మించాకా మ‌రో లొల్లి! ఇదే స‌రిపోతోంది కాంగ్రెస్ పార్టీకి. జానా రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాయ‌క‌త్వాలు క‌నీసం ఐదారు మంది నాయ‌కుల‌ను క‌లుపుకోలేక‌పోయాయి. వీళ్లలో వీళ్లు క‌లుపుకోలేక‌పోయిన‌ప్పుడు ఇక ప్ర‌జ‌ల‌నేం క‌లుపుకుపోతారు?

ఇక పీసీసీకి కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక‌లో కూడా కాంగ్రెస్ పార్టీలో దురావ‌స్థ కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి వ‌ర‌స‌గా మీటింగులు నిర్వ‌హించారు. ఆ మీటింగుల్లో ఏం తేలిందో కానీ.. ఇప్పుడు ఢిల్లీలో తతంగం మొద‌ల‌వుతోంద‌ట‌. ఇక్క‌డ అభిప్రాయాలు ఇచ్చిన వారు ఇక ఢిల్లీకి వెళ్లి ఒక‌రిపై మ‌రొక‌రు కంప్లైంట్లు చేసుకోవ‌డం మొద‌లైన‌ట్టుగా ఉంది!

అయినా వీళ్ల భ్ర‌మ కానీ.. ఎవ‌రో ఒక‌రిని పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించినా మిగ‌తా వాళ్లు వాళ్ల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశాలు ఏ మాత్రం లేవు. అలాంటి ఉద్దేశాలు లేవు. ఒక‌రి వెనుక మ‌రొక‌రు గోతులు తీసుకోవ‌డానికే కాంగ్రెస్ నేత‌ల‌కు స‌మ‌యం చాల‌దు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష స్థానాన్ని బీజేపీకి ఇచ్చేశారు. పోనుపోనూ తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ ప‌త‌నం కావ‌డ‌మే త‌ప్ప‌.. ఇక లేచే అవ‌కాశాలు లేన‌ట్టేనేమో!

అటూ ఇటూ ఎటూ కాలేక!