తమిళనాట అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.ప్రభు వివాహం వివాదంగా మారింది. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కులాంతర వివాహం చేసుకున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే బ్రహ్మణ యువతిని వివాహం చేసుకున్నారు. అదేం వివాదం కాదు కానీ, వయసు విషయంలోనే వివాదం రేగుతూ ఉంది.
ఆమె మైనర్ అని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. కులం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎమ్మెల్యే కుటుంబంతో తమకు చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలున్నాయని యువతి తండ్రి చెబుతున్నారు. అయితే మైనర్ అయిన తన కూతురుకు మాయమాటలు చెప్పి, ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు.
అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తూ ఉన్నాడు. తమది ప్రేమ వివాహం అని ఆయన చెబుతున్నారు. తన భార్యకు 19 యేళ్ల వయసు అని ఆమె మైనర్ కాదని ఆయన అంటున్నారు. తాము నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నట్టుగా ఆయన చెబుతున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే వయసు 36 సంవత్సరాలు. తన వయసులో దాదాపు సగం వయసున్న అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా అవుతోంది. అలాగే తమ ప్రేమది కూడా కేవలం నాలుగు నెలల వయసే అని ఆ ఎమ్మెల్యే చెబుతుండటం గమనార్హం.
తమది అంతకు మించి వ్యవధితో కూడుకున్న ప్రేమ అని చెప్పినట్టు అయితే మైనర్ బాలికతోనే ప్రేమ కార్యకలాపాలు నెరిపినట్టుగా అవుతుంది. ఈ వివాహం గురించి ఆ యువతి తన సమ్మతిని తెలుపుతూ, ఎమ్మెల్యేతో కలిసి ఒక వీడియో పెట్టింది. దీంతో ఆమె సమ్మతి మేరకే పెళ్లి జరిగినట్టుగా అవుతోంది.
ఈ కులాంతర వివాహాన్ని ఎవ్వరూ తప్పు పట్టకూడదు, అలా తప్పు పట్టడం కూడా సమంజసం కాదు. ఏదేమైనా బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఒక యువతిని, ఎమ్మెల్యే అనే బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకోవడం, వారిద్దరి మధ్యన ఏకంగా 17 యేళ్ల ఏజ్ గ్యాప్ చర్చనీయాంశం అవుతోంది.