కరోనా కంటే దానిపై ప్రసారమయ్యే భయోత్పాత కథనాలే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వల్ల అలా అవుతుంది, ఇలా అవుతుందంటూ వివిధ న్యూస్ చానళ్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని గత పది రోజులుగా చెబుతున్న విషయం తెలిసిందే.
తాజాగా చెవుల ద్వారా కూడా వ్యాపిస్తుందని సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇలాంటివి ఎలా పుడుతాయో తెలియదు కానీ….జనానికి మాత్రం నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయి. ఇక కరోనా మృతులపై ఇష్టానురీతిలో కథనాలు రాయడం, చానళ్లలో చెబుతుండడంతో ఒక రకమైన భయం సమాజాన్ని వణికిస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సమాజానికి వినూత్న సలహా ఇచ్చారు. కరోనా కంటే న్యూస్ చానళ్లే అసలు చేటు కలిగిస్తున్నాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అభిప్రాయపడ్డారు. న్యూస్ చానళ్లు కాస్తా న్యూసెన్స్ చానళ్లగా మారాయని వారు అంటున్నారు. న్యూస్ చానళ్లలో కరోనాపై నిత్యం వార్తలు చూడడం వల్ల ప్రజల్లో అవగాహన కంటే ఆందోళన ఎక్కువైందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అభిప్రాయపడ్డారు.
దీంతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. కనీసం 48 గంటల పాటు ఏ న్యూస్ చానల్ చూడకుండా ఉంటే తప్పక మార్పు వస్తుందని అన్నారు. కరోనా గురించి మనిషిలో ఆందోళన తగ్గడమే ఆ మార్పుగా వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లు చూడడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సూచించారు.