మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ తన అడ్డాగా ఇంత కాలం భావిస్తూ వచ్చిన ఆళ్లగడ్డలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన అఖిలప్రియకు …తాజా మున్సిపల్ ఫలితాలు మరింత షాక్ ఇచ్చాయి. ఈ ఫలితాలు ఆమె ప్రతిపక్ష నాయకత్వానికి కూడా సవాల్ విసిరాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా భూమా రాజకీయ వారసత్వం తమదేనని వాదిస్తూ వస్తున్న అఖిలప్రియ అన్న బీజేపీ నాయకుడైన భూమా కిషోర్‌కుమార్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో, తన సోదరితో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను సాధించారని ఆళ్లగడ్డ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆళ్లగడ్డ మున్సిపాల్టీలో మొత్తం 28 వార్డులున్నాయి. వీటిలో 8 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కూడా వైసీపీ తన సత్తా చాటుకుంది.
ఆళ్లగడ్డ మున్సిపాల్టీ వైసీపీ వశమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా భూమా రాజకీయ వారసత్వం కోసం అన్నాచెల్లెళ్లైన కిషోర్‌కుమార్‌రెడ్డి, అఖిలప్రియ మధ్య పరోక్ష పోరు సాగింది. ఇక్కడ 19 స్థానాల్లో టీడీపీ, 4 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ 14, టీడీపీ, బీజేపీ రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. ఒక్క చోట వైసీపీ రెబల్ అభ్యర్థి గెలుపొందాడు.
బీజేపీ అభ్యర్థులు 16,17 వార్డుల్లోనూ, టీడీపీ అభ్యర్థులు 11,20 వార్డుల్లోనూ గెలుపొందారు. అయితే కిషోర్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో కేవలం నాలుగు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2 చోట్ల గెలుపొందడం, 19 చోట్ల అఖిలప్రియ నాయకత్వంలో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండంటే రెండే స్థానాల్లో గెలుపొందడంపై ఆళ్లగడ్డలో రచ్చ జరుగుతోంది. భూమా కిషోర్‌కుమార్‌రెడ్డి తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటున్నాడనేందుకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు.
ఒకవేళ ఇప్పుడు నామినేషన్ వేసేందుకు అవకాశం దక్కింటే, పూర్తిస్థాయిలో పోటీకి దిగేవారమని కిషోర్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు చోట్ల సాధించిన విజయం స్ఫూర్తితో రానున్న రోజుల్లో భూమా అభిమానులు, బంధుమిత్రాదులను ఏకం చేసి బలమైన ప్రత్యామ్నాయ, ప్రతిపక్ష నేతగా ఎదుగుతానని ఆయన అంటున్నారు.
మద్దూరి అఖిలప్రియకు భూమా ఇంటిపేరుతో సంబంధం లేదని ఇప్పటికే కిషోర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయన నాయకత్వం ఏ మాత్రం బలపడుతుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.