రాజీనామా.. అఖిలేష్ రూటు స‌ప‌రేటు!

యూపీ అసెంబ్లీకి సంబంధించిన ఒక విశేషం ఏమిటంటే.. అక్క‌డ ముఖ్య‌మంత్రులు త‌ప్ప‌, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు అసెంబ్లీలో ఉండ‌రు! ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కావొచ్చు, మ‌రో పార్టీ కావొచ్చు.. వాటి త‌ర‌ఫు సీఎం అభ్య‌ర్థులు అసెంబ్లీలో ఉండ‌రు!…

యూపీ అసెంబ్లీకి సంబంధించిన ఒక విశేషం ఏమిటంటే.. అక్క‌డ ముఖ్య‌మంత్రులు త‌ప్ప‌, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు అసెంబ్లీలో ఉండ‌రు! ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కావొచ్చు, మ‌రో పార్టీ కావొచ్చు.. వాటి త‌ర‌ఫు సీఎం అభ్య‌ర్థులు అసెంబ్లీలో ఉండ‌రు! అసెంబ్లీకి పోటీ చేయ‌రు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌డావుడి చేయ‌డం.. గెలిస్తే మండ‌లి స‌భ్య‌త్వం ద్వారా సీఎం ప‌ద‌విని పొంది అసెంబ్లీకి వెళ్తారు. ఓడితే చలో ఢిల్లీ అంటూ లోక్ స‌భ లేదా రాజ్య‌స‌భ బాట ప‌డ‌తారు అక్క‌డి ముఖ్య నేత‌లు.

అఖిలేష్ యాద‌వ్.. త‌ను సీఎం కావ‌డానికి ముందు పార్ల‌మెంట్ స‌భ్యుడు. మాయావ‌తి కూడా అసెంబ్లీకి పోటీ చేయ‌లేదు. ముఖ్య‌మంత్రి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు అసెంబ్లీకి వెళ్లారు. ఆ త‌ర్వాత పార్టీ ఓడిపోగానే.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం తీసుకున్నారు. మ‌ళ్లీ అసెంబ్లీ మొహం చూసిన‌ట్టుగా లేరు ఆమె.

ఇక క్రితం సారి యూపీ సీఎం బాధ్య‌త‌లు తీసుకున్న యోగి ఆదిత్య‌నాథ్ ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌క ముందు.. లోక్ స‌భ‌లో ఉన్నారు. ఐదేళ్ల కింద‌ట యూపీలో బీజేపీ గెల‌వ‌గానే ఆయ‌న లోక్ స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి, యూపీ మండ‌లికి నామినేట్ అయ్యారు. సీఎంగా కొన‌సాగారు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాత సంప్ర‌దాయాల‌కు తెర‌తీస్తూ యోగి ఆదిత్య‌నాథ్ అసెంబ్లీకి పోటీ చేశారు. 

అలాగే అఖిలేష్ యాద‌వ్ కూడా. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా త‌న ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత అఖిలేష్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ఎంపీగా కొన‌సాగుతూ వ‌చ్చారు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈయ‌న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించారు. 

మ‌రి పాత లెక్క‌ల ప్ర‌కారం చూస్తే.. అఖిలేష్ ఇప్పుడు త‌న‌కున్న లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని కొన‌సాగిస్తూ, అసెంబ్లీని త‌ప్పించుకోవాలి. అయితే.. అందుకు భిన్నంగా ఆయ‌న లోక్ స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా కొన‌సాగ‌నున్న‌ట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఎంపీగా క‌న్నా.. ఎమ్మెల్యేగానే యూపీలో త‌న పార్టీని క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అయినా బ‌లోపేతం చేయ‌వ‌చ్చ‌ని అఖిలేష్ భావిస్తున్న‌ట్టుగా ఉన్నాడు!