ఆ టూత్ పేస్ట్ బ్రాండ్ కు జ‌రిమానా, ఇన్నాళ్ల‌కా!

టీవీల్లో త‌ర‌చూ ఒక టూత్ పేస్ట్ యాడ్ వ‌స్తూ ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డెంటిస్టులు  సిఫార్సు చేసే టూత్ పేస్ట్ అంటూ బీజీఎం లేని ఒక టూత్ పేస్ట్ యాడ్ చాలా కాలంగా ప్ర‌సారం అవుతూ…

టీవీల్లో త‌ర‌చూ ఒక టూత్ పేస్ట్ యాడ్ వ‌స్తూ ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డెంటిస్టులు  సిఫార్సు చేసే టూత్ పేస్ట్ అంటూ బీజీఎం లేని ఒక టూత్ పేస్ట్ యాడ్ చాలా కాలంగా ప్ర‌సారం అవుతూ ఉంది. దాదాపు ద‌శాబ్దం పై నుంచినే టీవీల్లో ఆ యాడ్ వ‌స్తోంది. 

ఆ యాడ్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఎవ‌రో డెంటిస్టుల‌ను చూపిస్తారు. వారు న‌టులు కాదు. నిజ‌మైన డెంటిస్టులు అంటూ యూకేలో ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టుగా పేర్కొంటారు. దేశీయ వైద్యులు ఎవ‌రైనా ఇలాంటి యాడ్స్ లో క‌నిపిస్తే వారిపై ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందంటారు. 

భార‌తీయ వైద్యులు ఎవ‌రైనా ఇలా ఒక బ్రాండ్ ను ప్ర‌మోట్ చేసే యాడ్స్ లో క‌నిపిస్తే.. ఆ బ్రాండ్లే ఆరోగ్య‌క‌రం అంటూ చెబితే.. వారి డిగ్రీని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ట‌. అందుకే.. ఈ యాడ్ లో కూడా యూకే అంటూ భార‌తీయ మూలాలున్న వాళ్ల‌ను చూపిస్తూ.. వారి చేత త‌మ సెన్సిటివ్ టూత్ పేస్ట్ ను ప్ర‌మోట్ చేస్తున్నారు!

ఈ యాడ్ ను ద‌శాబ్ద పై కాలం నుంచినే ప్ర‌సారం చేస్తున్నా.. ఎట్ట‌కేల‌కూ తాజాగా క‌న్సూమ‌ర్ ఫోర‌మ్ స్పందించింది. ఆ యాడ్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎక్కువ మంది డెంటిస్టులు రిక‌మెండేష‌న్ చేస్తున్న టూత్ పేస్ట్ అంటూ త‌ప్పుడు స‌మాచారాన్ని ఇస్తూ ప్ర‌మోట్ చేసుకుంటున్నార‌ని ఆ సంస్థ‌పై ప‌ది ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది.

మొత్తానికి ఇన్నాళ్ల‌కు అయినా మేల్కొన్నారేమో వినియోగ‌దారుల ఫోర‌మ్ వారు. విశేషం ఏమిటంటే.. పోటీ టూత్ పేస్ట్ కంపెనీల వారు కూడా ఇన్నేళ్లూ ఏం చేశార‌నేది! వాళ్లేమో టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, నిమ్మ‌కాయ చెక్క ఉందా.. అంటూ యాడ్స్ చేస్తున్నారు. ఈ రూట్లో కాకుండా.. వైట్ కోట్ వేసుకున్న అధికారిక వైద్యులు చేత ప్ర‌మోట్ చేయించుకుంటూ వ‌చ్చిన సంస్థ కు ఇప్పుడు జ‌రిమానా ప‌డింది.