కశ్మీరీ ఫైల్స్ సినిమాను కూలంకషంగా చరిత్రను తెరకెక్కించిన సినిమా కాదని పలువురు అంటున్నారు. మరి కొందరు ఇదే నిజమని చెబుతున్నారు. కశ్మీర్ లో ఉద్రిక్తతల వేళ బలైనది కేవలం పండిట్లు మాత్రమే కాదని.. అన్ని వర్గాల వారూ ఉన్నారనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాతో వీలైనంత రాజకీయ లబ్ధిని పొందవచ్చనే విషయాన్ని గ్రహించిన బీజేపీ, దాని భక్తులు ఎడా పెడా ప్రమోట్ చేస్తున్నారు.
ప్రత్యేకించి ఉత్తరాదిన ఈ సినిమాను ఒక రేంజ్ లో బీజేపీ నేతలు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే.. ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించడం కూడా మొదలైందట! ఉచితంగా ప్రదర్శించడం అంటే టికెట్లను కొని.. జనాలకు ఉచితంగా పంచడం కాదు. అధికారదర్పాన్ని ఉపయోగించి.. ఈ సినిమాను ఫ్రీ షోలుగా వేయిస్తున్నారట కమలనాథులు.
ఈ విషయంపై ఈ మూవీ మేకర్లు అభ్యంతరం చెబుతున్నారు. తమ సినిమాను ఉచితంగా ప్రదర్శించడం ఏమిటని, ఇది తమకు నష్టం చేకూర్చే అంశమని బీజేపీ ముఖ్య నేతల దృష్టికి వారు సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తున్నారు.
అంత అభిమానం ఉంటే తమ సినిమా టికెట్లను కొని తమను ప్రోత్సహించాలి కానీ, ఉచిత ప్రదర్శన అనేది చట్ట విరుద్ధం కూడా అని వారు అంటున్నారు. కేంద్రం చేసిన చట్టం ప్రకారం కూడా.. ఇది నేరమని వారు వాపోతున్నారు. ఇది కూడా పైరసీ కిందకే వస్తుందని అంటున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆ రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి వీరు తీసుకెళ్తున్నారు!
అయితే ఈ సినిమాకు ఇంత పబ్లిసిటీ రావడంతో బీజేపీ నేతలదే కీలక పాత్ర. మరి అలాంటిది కొన్ని షో లను వారు ఫ్రీగా జనాలకు చూపించి ప్రయోజనం పొందే ఎత్తుగడలు వేసినా.. వాటిని ఈ మూవీ మేకర్లు తట్టుకోలేకపోతున్నట్టున్నారు!