కొత్త జిల్లాల పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో రకరకాల డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. తమ ప్రాంతాల్లో విశిష్ట వ్యక్తుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సత్యసాయి, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పేర్లను ఆయా ప్రాధాన్యతలను బట్టి పెట్టిన సంగతి తెలిసిందే. వివిద జిల్లాల్లో దామోదర సంజీవయ్య, వంగవీటి మోహన్రంగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను కూడా పెట్టేందుకు పరిశీలించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు భూమా అఖిలప్రియ తన అత్యాశను బయట పెట్టుకున్నారు. నంద్యాల జిల్లాకు తన తండ్రి భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని ఆమె ఫేస్బుక్ వేదికగా డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల అఖిలకు కొడుకు పుట్టాడు. తన కన్నబిడ్డకు మాత్రం బాహు అని నామకరణం చేశారామె. కానీ జిల్లాకు మాత్రం తండ్రి పేరు పెట్టాలనే అఖిలప్రియ డిమాండ్ ఎంతో విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కన్న బిడ్డకు పేరు విషయంలో పూర్తి స్వేచ్ఛ తల్లిదండ్రులకు వుంటుంది. తన కుమారుడి పేరు విషయంలో మాత్రం తన తండ్రి పేరును గుర్తు చేసుకోకపోవడం, ఇప్పుడు నంద్యాలకు పెట్టాలని అఖిల కోరడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నంద్యాల రూపు రేఖలు మార్చి, నంద్యాల అభివృద్ధి ఉరుకులు పెట్టించినది భూమా నాగిరెడ్డి. కావున అధి ఆయనకు మనం ఇచ్చే అత్యున్నత గౌరవం. నంద్యాల ను భూమా నాగిరెడ్డి జిల్లాగా చేయాలని కోరుతున్నానంటూ అఖిలప్రియ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు.
తండ్రిపై తనయగా ఆమె ప్రేమను ఎవరూ కాదనలేరు. కానీ తన బిడ్డకు మాత్రం కొత్త పేరు పెట్టుకుని, ఊరందరి విషయంలో మాత్రం తండ్రి పేరు పెట్టాలని డిమాండ్ చేయడమే విమర్శలకు దారి తీసింది.