కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని స్వాగతించేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిగ్గు పడుతున్నట్టున్నారు. ఎందుకంటే దివంగత ఎన్టీఆర్కు తానెంత ద్రోహం చేసింది ఆయన ఆత్మకు తెలియడం వల్లే… కనీసం ప్రేమ నటించేందుకు కూడా బాబుకు మనసు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా పెట్టింది. దీంతో తన వైఖరి ప్రకటించేందుకు టీడీపీ తర్జనభర్జన పడుతోంది.
రెండు రోజులు ఆలస్యంగా ఎన్టీఆర్ పేరుపై టీడీపీ స్పందించింది. ఇందులో కూడా డొంకతిరుగుడు ధోరణే. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పేరును ఓ జిల్లాకు గౌరవ సూచకంగా పెడితే, వెంటనే హర్షం ప్రకటించాల్సింది పోయి మీనమేషాలు లెక్కపెట్టడం ఒక్క టీడీపీకే చెల్లింది. ఈ విషయమై ఇప్పటికీ చంద్రబాబు పేరుతో ప్రకటన రాకపోవడం… దివంగత నేతపై ఆయన ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తామని, కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తామెందుకు వ్యతిరేకిస్తామని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో నేతలు అన్నట్టు మాత్రమే ఓ వార్తా కథనం వెలువడింది. నేరుగా చంద్రబాబు పేరుతో స్వాగతిస్తున్నట్టు రాకపోవడాన్ని గమనించొచ్చు.
రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ అమరావతిలో ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్టును నిలిపివేసిన జగన్ ప్రభుత్వం, ఆయనపై ఎంతో ప్రేమ ఉందని ప్రజల్ని నమ్మించేందుకు విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
చివరకు ఎన్టీఆర్ పేరు మీద ఉన్న అన్న క్యాంటీన్లనూ జగన్ ప్రభుత్వం నిలిపి వేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మరి ఎన్టీఆర్ను సీఎం కుర్చీ నుంచి అమానవీయంగా కూలదోసి, వారసులను కరివేపాకులా వాడుకున్న చంద్రబాబు… ఆ తర్వాత కాలంలో ఆయన మరణానికి పరోక్షంగా కారణం అయ్యారనే విమర్శలకు ఏం సమాధానం చెబుతారు?
అధినేతనే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తరిమేసి, మళ్లీ ఆయన పేరుతో అన్నా క్యాంటీన్లు, స్మృతి వనం లాంటివి చేపడితే జనం నమ్మేదెలా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ను తాను పదవీచ్యుతుడిని చేస్తే మాత్రం లోక కల్యాణార్థం అనే రీతిలో చంద్రబాబు, ఎల్లో మీడియా బిల్డప్ ఇవ్వడం వారికే చెల్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకున్నారనేందుకు ఆయన స్పందనా రాహిత్యమే నిదర్శనం.