స్థానిక ఎన్నికల నిర్వహణ అంశం కోర్టు పరిధిలో ఉన్నా.. ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలను పిలిచి చర్చలు మొదలుపెట్టారు ఏపీ స్టేట్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. స్థానిక ఎన్నికల నిలుపుదలపై ఇది వరకూ ఏపీ ప్రభుత్వం కోర్టుకు ఎక్కినప్పుడు, ఎన్నికలను జరపడం, ఆపడం విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీం కోర్టు నిమ్మగడ్డకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే కోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వంతో సంప్రదించేదే లేదన్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా పార్టీలతో సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం తీసుకోకుండా ఊరూపేరు లేని పార్టీలను కూడా పిలవడం పై విమర్శలు వస్తున్నాయి.
ఆయన ఎంత ఎన్నికల కమిషనర్ అయితే మాత్రం.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని లెక్క చేయనట్టుగా వ్యవహరించడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే నిమ్మగడ్డ మాత్రం వాటిని లెక్క చేయడం లేదు.
ఈ క్రమంలో ఎట్టకేలకూ తను అనుకున్నట్టుగా సమావేశాన్ని నిర్వహించారు నిమ్మగడ్డ. ఈ సందర్భంగా హాజరైన పార్టీలు తమకు తోచిన విషయాలను చెప్పినట్టుగా తెలుస్తోంది.
టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్నారట. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన తేల్చారట.
ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను పిలవాలని సలహా ఇచ్చారట! కరోనా టైమ్ లో ఎన్నికలేమిటి? అంటూ ఇది వరకూ ప్రశ్నించిన టీడీపీ రోజుకు మూడు వేల కేసులు వస్తున్నా.. ఎన్నికలకు ఉబలాట పడుతుండటం గమనార్హం.
ఇక కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ప్రభుత్వంతో సంప్రదించాలని సూచించాయట. వీటిలో కూడా సీపీఐ స్పందిస్తూ.. ఏకగ్రీవాలను రద్దు చేయాలని, ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి నిర్వహించాలని కోరినట్టుగా తెలుస్తోంది.
సీపీఎం మాత్రం.. వైద్యారోగ్య శాఖ నివేదికను తీసుకుని.. ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నిర్వహణ గురించి ఆలోచించాలని కాస్త అర్థవంతంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సూచనను అసలు నిమ్మగడ్డ ఖాతరు చేస్తారో లేదో!
జనసేన ఈమెయిల్ ద్వారా స్పందించిందట! ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ ఓకే అంటుందట. బీఎస్పీ కూడా ఈ సమావేశానికి హాజరైందట! ఆ పార్టీ ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియనంతా రద్దు చేసేయాలని కోరిందట! ఈ పార్టీ అడ్రస్ ఏమిటో తెలీదు కానీ.. కోరిక మాత్రం గట్టిగా ఉంది.
బీజేపీ కూడా బీఎస్పీ డిమాండ్ నే చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియనంతా రద్దు చేయాలని కోరిందట కమలం పార్టీ.
కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఇప్పుడు ఎన్నికలు అవసరమా అన్నట్టుగా స్పందించినట్టుగా సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాకా.. ఎన్నికల నిర్వహణ చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ సూచించినట్టుగా తెలుస్తోంది.
ఎలాగూ జడ్పీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఆ ఎన్నికలు నిర్వహిస్తే చైర్మన్ల ఎన్నిక అర్థవంతంగా ఉంటుందనేది కాంగ్రెస్ ఉద్దేశంలా కనిపిస్తోంది.
ఈ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎస్ఈసీ ఏకపక్ష పోకడలను నిరసిస్తూ ఆ పార్టీ ఈ సమావేశానికి గైర్హాజరైంది.