సంచ‌ల‌నం రేపిన హ‌త్య‌ల కేసులో దోషికి ఉరిశిక్ష‌

లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌రంగల్ జిల్లాలో చోటు చేసుకున్న తొమ్మిది హ‌త్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లం గొర్రెకుంట వ‌ద్ద ఒక బావిలో తొమ్మిది…

లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌రంగల్ జిల్లాలో చోటు చేసుకున్న తొమ్మిది హ‌త్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లం గొర్రెకుంట వ‌ద్ద ఒక బావిలో తొమ్మిది మంది మృత‌దేహాలు తేల‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది.

సంచులు కుట్టుకుని, కాయాక‌ష్టం చేసుకునే ఒక ముస్లిం కుటుంబంలోని స‌భ్యులంతా బావిలో శ‌వాలుగా తేల‌డం సంచలనంగా నిలిచింది. లాక్ డౌన్ వ‌ల్ల కుటుంబ పోష‌ణ బ‌రువై వారు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారేమో అనే అనుమానాల‌తో మొద‌లై.. పోలీసుల విచార‌ణ‌లో అనేక మ‌లుపులు తిరిగింది ఆ కేసు. చివ‌ర‌కు వారివి హ‌త్య‌ల‌ని పోలీసులు నిర్ధారించారు.

ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన ఆ ముస్లిం కుటుంబం వ‌ల‌స వ‌చ్చి ప‌నులు చేసుకుంటూ బ‌తుకుతూ ఉంది. వారికి బిహార్ కు చెందిన సంజ‌య్ కుమార్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఆ కుటుంబానికి చెందిన భ‌ర్త‌లేని ఒక మ‌హిళ‌తో సంజ‌య్ కుమార్ సంబంధం పెట్టుకున్నాడు.

ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ అత‌డు మాటిచ్చాడ‌ట‌. అయితే అత‌డి చూపు ఎదిగొచ్చిన ఆమె కూతురు మీద ప‌డింది. అది గ్ర‌హించి స‌ద‌రు మ‌హిళ నిల‌దీయ‌గా.. పెళ్లి చేసుకోవ‌డానికి ఆమెను బెంగాల్ కు తీసుకుపోతున్న‌ట్టుగా రైలెక్కించి, హ‌త్య చేసి నిడ‌ద‌వోలు వ‌ద్ద రైల్లోంచి తోసేసి, త‌ను తిరిగి వెళ్లిపోయాడు సంజ‌య్ కుమార్.

ఈ క్ర‌మంలో స‌ద‌రు మ‌హిళ కూతురు అత‌డిని నిల‌దీసింది. త‌న త‌ల్లి ఎక్క‌డంటూ ఆమె నిల‌దీయ‌డంతో.. త‌న‌పై అనుమానాలు వ‌స్తాయ‌నే విష‌యాన్ని గ్ర‌హించి, ఆ అనుమానాలు బ‌ల‌ప‌డ‌క ముందే ఆమె కుటుంబం తినే అన్నంలో మ‌త్తుమందు పెట్టి, స్పృహ‌త‌ప్పాకా వారిని ఒక్కొక్క‌రిగా తీసుకెళ్లి బావిలో ప‌డేశాడు సంజ‌య్ కుమార్.

తొమ్మిది మందినీ అలా కిరాత‌కంగా హ‌త‌మార్చాడు. బావిలో ముందుగా ఒక శవం తేల‌డం, ఆ త‌ర్వాత తొమ్మిది శ‌వాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో విస్మ‌య‌క‌ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పోలీసులు త‌మదైన శైలిలో విచారించ‌గా అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప‌క్కా సాక్షాల‌తో పోలీసులు సంజ‌య్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజ‌రు ప‌రిచారు. మే 21న ఆ హ‌త్య‌లు జ‌ర‌గ‌గా ఐదు నెల‌ల్లోనే కోర్టులో నేరాన్ని నిరూపించి పోలీసులు దోషిని నిల‌బెట్టారు. విచారించిన వ‌రంగల్ న్యాయ‌స్థానం అత‌డికి ఉరిశిక్ష‌ను విధించింది.

ఒక హ‌త్య చేసి దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానిక‌ని చిన్న పిల్ల‌ల్ని కూడా కిరాత‌కంగా చంపిన అత‌డికి త‌గిన శిక్ష‌నే విధించింది న్యాయ‌స్థానం. ఐదు నెల‌ల్లో పోలీసులు త‌మ ప‌ని పూర్తి చేశారు కానీ, అంత ఘాతుకానికి పాల్ప‌డిన అత‌డికి శిక్ష అమ‌ల‌య్యేదెప్పుడు? అనేది ప్ర‌శ్నార్థ‌కం.

ఇది టీడీపీ కాదు కరణం గారూ