జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు సరికొత్త బినామీగా చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ముందు రోజు రాత్రి చంద్రబాబు ఇంటికెళ్లి ప్యాకేజీ తెచ్చుకోవడం, మరుసరి రోజు బాబుకు అనుకూలంగా వ్యవహరించడంం పవన్ కు అలవాటైపోయిందన్నారు. చివరికి లోకేష్ ను మంగళగిరిలో గెలిపించేందుకు, తన పార్టీ నుంచి అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని, అలా తన సొంత పార్టీని కూడా పవన్ మోసం చేశారని ఆరోపించారు ఆళ్ల.
“గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం జనసేన పార్టీని కూడా మోసం చేశావ్. అలా మోసాలు చేసి, అక్రమాలు చేసి, చంద్రబాబు దగ్గర్నుంచి ప్యాకేజీ తీసుకొని ఈరోజు రైతులకు ఏదో అన్యాయం జరిగిందంటూ గ్రామాల్లో పర్యటించావు. గ్రామాల్లోకి వచ్చేముందు, అసలు జనసేన పార్టీ తరఫున ఏం చేశారో కాస్త ఆలోచించుకోవాల్సింది. రైతు సమస్యల మీద అనేక పోరాటాలు చేశానని చెప్పుకునే పవన్ కల్యాణ్, ఒక్క పోరాటం గురించైనా పైకి చెప్పాలి. కనీసం పేపర్ లోనైనా చూపించాలి.”
పవన్ ఆవేశంగా మాట్లాడితే పనులు జరగవన్నారు ఆళ్ల. మరీ ముఖ్యంగా చంద్రబాబుకు మద్దతుగా పవన్ మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, ఇకనైనా పవన్ కల్యాణ్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో పవన్ చేసిన నిరాహార దీక్ష అంశాన్ని ప్రస్తావించారు.
“పవన్ మళ్లీ ప్యాకేజీ తీసుకున్నారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు దోపిడీని, అవినీతిని సపోర్ట్ చేస్తూ అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు గతంలో భూసమీకరణకు సిద్ధమైనప్పుడు, బేతపూడిలో పర్యటించిన పవన్ కల్యాణ్, చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అలా ప్రకటించిన 2 రోజులుకే బాబు భూసమీకరణ చేశారు. అప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదో పవన్ చెప్పాలి.”
ఇకనైనా పవన్ కల్యాణ్ తన ప్యాకేజీ రాజకీయాలు మానేయాలన్నారు ఆళ్ల. అమరావతిని స్పెషల్ అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆళ్ల.. కేవలం వ్యవసాయం మీద ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.