మంత్రి అనిల్ మంచోడే.. కానీ వాళ్ల బాబాయే కాస్త..!

ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయనుకుంటున్న వేళ.. ఎవరి పదవి ఉంటుందో, ఎవరి పదవి ఊడుతుందో, కొత్తగా ఎవరికి పదవులు వస్తాయో తెలియక నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ దశలో మంత్రి వర్గంలో ఉన్నవారిపై…

ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయనుకుంటున్న వేళ.. ఎవరి పదవి ఉంటుందో, ఎవరి పదవి ఊడుతుందో, కొత్తగా ఎవరికి పదవులు వస్తాయో తెలియక నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ దశలో మంత్రి వర్గంలో ఉన్నవారిపై ఏ చిన్న ఆరోపణలు వచ్చినా హడలిపోవాల్సిందే. నెల్లూరు జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది.

నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిన్నాన్న రూప్ కుమార్ యాదవ్ పై ఆరోపణలు వచ్చాయి. స్థలం విషయంలో తమను పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తున్నారంటూ ఓ కుటుంబం రోడ్డుకెక్కింది. పోలీసులంతా తమ ఇంటిని చుట్టుముట్టారంటూ వారు ఆందోళనకు దిగారు. అనిల్ మంచోడే కానీ, రూప్ కుమారే తమని ఇబ్బంది పెట్టారని వారు అంటున్నారు.

సహజంగానే ప్రతిపక్షాలకు ఇదో విందు భోజనం. ప్రతిపక్ష నేతలు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇక టీడీపీ అనుకూల మీడియా దీనిపై కథనాలు అల్లింది. అనిల్ ఆగడాలు పెచ్చుమీరిపోయాయని, అధికార బలంతో ఆయన చిన్నాన్న రూప్ కుమార్, నగరాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారని కూడా టీడీపీ నేతలు రెట్టించారు.

సొంత పార్టీ నేతల్లోనే లుకలుకలు..

నెల్లూరు జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలకు పదింటిని వైసీపీ కైవసం చేసుకున్నా, రెండు ఎంపీ స్థానాలను ఒడిసి పట్టుకున్నా.. మంత్రి పదవుల విషయంలోకి వచ్చే సరికి సొంత  పార్టీలోనే లుకలుకలు మొదలయ్యాయి. సీనియర్లను పక్కనపెట్టి, ఇద్దరు యువకులు అనిల్, గౌతమ్ రెడ్డికి పదవులిచ్చారు. దీంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. నెల్లూరు సిటీపై ఆధిపత్యం తగ్గిపోతోందని అటు ఆనం రామనారాయణ రెడ్డి, అనిల్ వర్గంపై అవకాశం దొరికినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ దశలో ప్రతిపక్షాలకు కూడా ఇదో ప్రధాన అస్త్రంలా మారింది.

మంత్రి అనిల్ చిన్నాన్న రూప్ కుమార్ యాదవ్, ప్రతిపక్షంలో ఉండగా నెల్లూరు నగర కార్పొరేషన్లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక, అనిల్ మంత్రి అయ్యాక ఆయనే నగరానికి సంబంధించి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. మంత్రి అనిల్ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలన్నీ ఆయన కనుసైగతోనే జరుగుతాయని అంటారు.

తాజాగా.. నెల్లూరు నగర కార్పొరేషన్ కి ఎన్నికలు జరిగాక, మేయర్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో.. అనిల్ తరపున రూప్ కుమార్ ని డిప్యూటీ మేయర్ గా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.

సహజంగానే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువర్గంలో ఎవరో ఒకరు వారి వ్యవహారాలు చూస్తుంటారు. నెల్లూరు సిటీ విషయంలో మంత్రి అనిల్ వ్యవహారాలన్నీ రూప్ కుమార్ చూసుకుంటుంటారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో అధికార పార్టీ నేతలు కాస్త సంయమనం పాటించాల్సి ఉంది. కానీ ఇలా వ్యవహారం రోడ్డున పడితే మాత్రం అది నేతలకే కాదు, పార్టీకి కూడా నష్టం. ఈ దశలో తీరిగ్గా పంచాయితీ పెట్టుకుని సర్దుబాట్లు చేసుకోవడం కంటే.. అసలు ఆరోపణలు రాకుండా చూసుకోవడమే మంచిది.