నేను బాబు తొత్తును కాను…?

అవును మరి. ఎవరికైనా కోపం వస్తుంది కదా ఇలాంటి మాటలు అంటే. అందులో జీవితమంతా కరడు కట్టిన కామ్రేడ్ గా బతికిన సీపీఐ నారాయణకు కోపం వచ్చిందంటే సహజమే అనుకోవాలి. ఆయన తనను చంద్రబాబుకు…

అవును మరి. ఎవరికైనా కోపం వస్తుంది కదా ఇలాంటి మాటలు అంటే. అందులో జీవితమంతా కరడు కట్టిన కామ్రేడ్ గా బతికిన సీపీఐ నారాయణకు కోపం వచ్చిందంటే సహజమే అనుకోవాలి. ఆయన తనను చంద్రబాబుకు తొత్తు అంటున్నారు వైసీపీ నేతలు అంటూ మండిపడ్డారు. తనని అలా అనడం కంటే అత్యంత హాస్యాస్పదం వేరొకటి లేదు అని కూడా చెబుతున్నారు.

ప్రభుత్వం మొత్తం ముప్పయి లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలను పేదలకు ఇస్తోంది. పట్టణ ప్రాంతాలలో సెంటు అయితే గ్రామాల్లో సెంటున్నర లెక్క కింద సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చింది. అయితే మరీ ఇంత తక్కువ స్థలాల్లో ఇళ్ళు ఏంటని  వీటి మీద హైకోర్టు తాజాగా తీర్పు ఇస్తూ వాటిని నిలుపు చేసింది. ఇది మంచి తీర్పు అంటున్నారు సీపీఐ నారాయణ.

తాము గతంలోనే ఈ విషయం చెప్పామని, మరీ అంత తక్కువ స్థలంలో ఇళ్ళేమిటి అని కూడా నిలదీశారు. తాను ఇలా అన్నపుడు తనను చంద్రబాబు తొత్తు అని వైసీపీ మంత్రులు అన్నారని వారు ఇపుడు తనకు క్షమాపణ చెప్పాలని కూడా నారాయణ డిమాండ్ చేశారు.

సరే సీపీఐలోనే జీవితకాలమంతా పనిచేస్తూ వచ్చిన నారాయణకు తొత్తు అనడం తప్పే. కానీ పేదలకు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ముందుకు రాలేదు. ఇక కమ్యూనిస్టులు ఎపుడూ పేదల కోసమే పోరాడుతారు అన్నది తెలిసిందే. 

మరి నారాయణ లాంటి వారు దీని మీద హర్షం వ్యక్తం చేయడమేంటి అని వైసీపీ నేతలు అంటున్నారు. తక్కువ స్థలం అంటున్నారు, కానీ గతంలో ఇంతకంటే ఎక్కువ స్థలాలు ఎవరు ఇచ్చారో చూపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.