పెద్ద గొంతుతో ఆసక్తికరంగా స్పష్టమైన భాషలో మాట్లాడే ప్రతివారూ మేథావులు కారు. మేథావుల్లాగ అనిపిస్తారంతే. మనసులో ఎజెండా లేకుండా రాజకీయాల్లో ఎవ్వరూ నోరు విప్పరు.
మనం మాట్లాడుకునేది శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి. ఆయన న్యాయశాస్త్రం చదివారు. కానీ అన్నిసార్లూ న్యాయం మాట్లాడరు. నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగ నాలుక తిప్పుతారు. దాందేవుంది ఆయన లాయరే కదా అని సరిపెట్టేసుకోవచ్చు.
కానీ ఒక్కోసారి జగమెరిగిన సత్యాల్ని కూడా అబద్ధాలుగా నిరూపించాలనే ఆయన వాదన ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఏ రాష్ట్రమైన అర్హతను దాటి అప్పు చేయలేదు. చేస్తానన్నా కేంద్రం చేయనీయదు. ఇది ప్రాధిమిక సత్యం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమపథకాలు పంచడం వల్ల ఆర్థికవ్యవస్థ కూలిపోతుందని ఉండవల్లి గారు చెప్పే మాట ఆయనకున్న మేథావి ఇమేజ్ కి అస్సలు పొసగట్లేదు.
ఒక్కసారి ప్రపంచంవైపు చూద్దాం. అక్కడి విషయం చెప్పుకున్నాక మనకొక ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం పక్క రాష్ట్రం వైపు చూసి తెలుసుకుందాం.
అప్పట్లో జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ప్రజలందరి అకౌంట్స్ లోనూ వెయ్యి డాలర్లు జమ చేయించాడు. కారణం అప్పట్లో ఆర్ధికమాన్యం కుదిపేస్తోంది. ఎందరికో ఉద్యోగాలు పోయాయి. అలా జమ అయిన డబ్బుతో జనం జీవనం కొనసాగించారు. అంటే షాపింగ్ చేసి కావాల్సినవి కొనుక్కున్నారు. దాంతో కుదేలైన వ్యాపారరంగం కూడా ఊపిరి పీల్చుకుంది. షేర్ మార్కెట్ నిద్రలేచింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మళ్లీ కొంత డబ్బు ప్రభుత్వ ఖజానాను చేరింది.
ఈ మధ్యన కరోనా కాలంలో డొనాల్డ్ ట్రంప్ స్టిములస్ చెక్స్ పేరుతో జనానికి డబ్బు పంచాడు. మళ్లీ పాత పద్ధతిలోనే ఎకానమీ చతికిలపడకుండా ఆగింది.
ఆంధ్రప్రదేశులో కూడా అదే మాదిరిగా పథకాల పేరుతో పేదల అకౌంట్సులో డబ్బులు పడుతున్నాయి. దాంతో లాక్డౌన్ కాలంలో వారికి పని లేకపోయినా ప్రశాంతంగా బతకగలిగారు. ఆ డబ్బుతో కావాల్సినవి కొనుక్కుని ధైర్యంగా జీవిస్తున్నారు. లోకల్ వ్యాపారస్తులు కూడా బతుకుతున్నారు. పేదవాళ్లు కొనే సబ్బుబిళ్ల, బొట్టు బిళ్ల, బియ్యం, పప్పు, బట్టలు, చెప్పులు..ఇలా ఏ వస్తువునుంచైనా ఇండైరక్ట్ ట్యాక్సెస్ రూపంలో కొంత మొత్తం రాష్ట్ర ఖజానాకు వెనక్కొచ్చి చేరుతుంది. సూటిగా చెప్పాలంటే ఎక్కడి డబ్బు అక్కడే ఉండి చేతులు మారుతూ అందర్నీ సంతృప్తి పరుస్తూ ఉంది.
బాగుంది కదా! పేదలకి డబ్బులు పంచితే ఏడుపెందుకు? అనగానే వెంటనే ఒక ప్రశ్న వెయ్యాలనిపిస్తుంది.
ఏమిటది?
“అమెరికా సంపన్న దేశం. ఎన్నో కంపెనీలున్నాయి. డబ్బున్న దేశం ఎంతైనా జనానికి పంచుతుంది. ఆదాయం లేని ఆంధ్ర ప్రదేశుకి అప్పు చేసి పంచాల్సినంత సోకు అవసరమా?”..అని..
ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణాకేసి చూద్దాం. హైదరాబాదులో కంపెనీలున్నాయి. ఆ నగరం వల్ల ఆ రాష్ట్రానికి బోలెడంత ఆదాయం ఉంది. అక్కడ కూడా దళితబంధు, కళ్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలున్నాయి. అయినా సరే అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
మన దేశానికి వందలక్షల కోట్ల అప్పుంది.
ఆమాటకొస్తే ప్రపంచంలోనే సంపన్నదేశం అని చెప్పుకునే అమెరికాకి ఎవరెస్ట్ పర్వతమంత అప్పుంది.
కనుక అర్హతకు తగిన అప్పువల్ల దేశాలు, రాష్ట్రాలు కుదేలైపోవు.
ఇదంతా చెప్పినా వెనెజులా దేశాన్ని ఉదాహరణగా చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా పయనిస్తోందని వాపోతారు కొందరు కుహనా మేథావులు. కేవలం పేదలకి పథకాలిచ్చి వాళ్లని సోమరులుగా మార్చడం వల్ల క్రమంగా ఆ దేశం కుప్పకూలిందని రాసేవాళ్లు రాసేస్తారు. కానీ పేదరికం, అనారోగ్యం, నేరాలు, మానవహక్కుల ఉల్లంఘన, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రాజకీయ సంక్షోభం, విదేశీ సైనిక చర్య ఇలా అనేక కారణాలు ఆ దేశాన్ని పతనం వైపుకు నడిపించాయి.
కానీ వీటన్నిటికీ కారణం ఉచితపథాలొక్కటే అని వాదించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వవ్యతిరేకులకి ఇష్టం.
యాక్సిడెంటుకి కారణమేంటని అడిగితే “ప్రయాణమే” అని చెప్పినట్టు వెనెజులా పతనానికి కారణం ఉచితపథకాలే అని చెప్పటం ఒక వర్గానికి భలే సరదా.
పేదలకి డబ్బులు పంచిన ఏ రాష్ట్రప్రభుత్వమూ పతనమవ్వదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కేంద్రం అనుమతిని మించి అప్పులు తేలేదు. అవసరానికి సరిపడా అప్పు పుట్టనప్పుడు ఖర్చులు తగ్గించుకోవడమో, ధరలు పెంచుకోవడమో తప్పదు. ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఇదే. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచంలో భాగమే.
ఉండవల్లిగారికి ఇవన్నీ తెలియవని కాదు. చెప్పడం ఇష్టముండదంతే.
ఆయన చెప్పాల్సింది లక్షల కోట్లు బ్యాంకులకి ఎగవేసి, విదేశాలకి తరలించే బడాదొంగల గురించి. దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేది వీళ్లు తప్ప పేద ప్రజలు ఎప్పటికీ కాదు.
చాలామంది డ్రాయింగ్ రూం మేథావులకి ఒక అపోహ ఉంటుంది. తాము కట్టే ఆదాయపు పన్నుతోనే దేశం నడుస్తోందని, పేదలకి సంక్షేమ పథకాలు అందేస్తున్నాయని.
నిజానికి మన దేశంలో ఆదాయపు పన్ను కట్టే వారి శాతం కనీసం 10% కూడా లేదు. వారిలో దాదాపు 6% మంది ఖర్చులు చూపించి జీరో ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళే. అంటే ఆ 4% మొత్తం దేశాన్ని పోషిస్తోందన్న బిల్డప్పులో బతుకుతుంటారు.
నిజానికి పేదవాళ్లు ఎక్కువ శాతం ఉన్న మన దేశంలో వాళ్లు కొనే వస్తువుల మీద ప్రభుత్వానికి చేరే పరోక్షపన్నులు చాలా ఎక్కువ. పైన చెప్పుకున్నట్టు సబ్బుకొన్నా, దువ్వెన కొన్నా కూడా ఎంతో కొంత పన్ను ప్రభుత్వానికి వస్తుంది. ధనికుడు కొన్నాడా, పేద వాడు కొన్నాడా అని కాదు. ఎవరు కొన్నా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అలా వచ్చే పన్నుల ఆదాయంతోనే సంక్షేమ పథకాలు నడుస్తాయి. కనుక పేదలకిచ్చే పథకాల్లో పేదలు కట్టే పరోక్ష పన్నులు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ల పథకలకి వాళ్లు కూడా నైతిక హక్కుదారులే.
దీనినిబట్టి ఏ ఎగువ మధ్యతరగతి వాడూ పేదవాడిని దేశానికి భారంగా చూడక్కర్లేదు. ముఖ్యంగా నిత్యం పేపర్లు చదువుతూ టీవీల్లో వార్తలు చూస్తూ కాలం గడిపే ఆ ఎగువ మధ్యతరగతి వర్గం వారి ఆలోచనల్లో మార్పు రావాలి. అప్పుడు పేదలకిచ్చే పథకాల మీద పడి ఏడవడమనే జబ్బు సమాజంలో తగ్గుతుంది.
ఉండవల్లి గారు ఆర్థిక శాస్త్రాన్ని ఈ దిశలో బోధించరు. ఆయనకెలా ఇష్టమో అలా వాదిస్తారంతే.
శ్రీనివాస మూర్తి