అసలు ఓటేస్తారా.. నటుల చిత్తశుద్ధి తేలే రోజు ఇదే

ఓటు మన హక్కు, మనందరం రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంటూ సాధారణ ఎన్నికల సమయంలో నటీనటులు ఊదరగొడుతుంటారు. అంతే కాదు, ఉదయాన్నే ఓటు వేసి, వేలికి సిరా గుర్తుతో ఫొటోలకు…

ఓటు మన హక్కు, మనందరం రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంటూ సాధారణ ఎన్నికల సమయంలో నటీనటులు ఊదరగొడుతుంటారు. అంతే కాదు, ఉదయాన్నే ఓటు వేసి, వేలికి సిరా గుర్తుతో ఫొటోలకు పోజులిచ్చేస్తుంటారు. మరి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మాత్రం ఇప్పటి వరకూ ఎప్పుడూ 50 శాతానికి పోలింగ్ మించలేదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే.

ఏకగ్రీవాల జమానాలో ఎలాగూ ఎవరూ ఓటు వేయలేకపోయారు. ఇప్పుడు పోలింగ్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కూడా చాలామంది ఓటింగ్ కి దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉంటారు సరే.. మరి పోస్టల్ బ్యాలెట్ ని అయినా వారు వినియోగించుకుంటారా అనేది అనుమానం. సమాజానికి సుద్దులు చెప్పే సినీ నటులు, తమ సంఘం కోసం జరుగుతున్న ఎన్నికను ఈసారి ఎలా చూస్తారో ఈరోజే తేలిపోతుంది.

'మా' ఎన్నికలపై ఇప్పటి వరకూ ఆయా ప్యానెళ్లలో ఉన్నవారు మాత్రమే బయటికొచ్చి మాట్లాడారు. మిగతావారంతా గుంభనంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ మినహా మిగతా పెద్ద కుటుంబాలేవీ తమ మద్దతు వీరికీ అంటూ ప్రకటించలేదు. అందులోనూ మెగా ఫ్యామిలీలో అందరి తరపున నాగబాబు మాత్రమే మాట్లాడారు. ఇంకెవరూ బయటకు రాలేదు, కనీసం ఆ టాపిక్ కూడా ఎత్తలేదు. ఈ దశలో అసలు మెగా ఫ్యామిలీ నటీనటులైనా వచ్చి 'మా' ఎన్నికల్లో ఓటు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

'మా' ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఓడినవారిని వెంటనే వచ్చి కౌగిలించేసుకుంటారు. మనం మనం ఒకటేనంటారు. ఈసారి ఆ సీన్ ఫలితాల కంటే ముందే కనిపించింది. అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పొద్దున్నే పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. మోహన్ బాబు సమక్షంలో కౌగిలించుకున్నారు. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కాళ్లకు దండం పెట్టారు. మరో పెద్ద హైలెట్ ఏంటంటే.. అందరికంటే ముందు పవన్ కల్యాణ్ పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేసి వెళ్లారు.

వాస్తవానికి 'మా' ఎన్నికల్లో అజెండాలు, మేనిఫెస్టోలు, ప్రెస్ మీట్లు, తిట్లు.. ఇలాంటివేవీ పెద్దగా ప్రభావం చూపవు. కానీ ఈ సారి మీడియా ఈ ఎన్నికలను బాగా హైలెట్ చేసింది. పోటా పోటీగా రెచ్చగొట్టి మరీ అందరి ఇంటర్వ్యూలు తీసుకుంది. ఈ దశలో సినిమావాళ్ల అభిప్రాయం ఎలా ఉంటుంది అని సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు.

ఆచార్య, ఆర్ఆర్ఆర్ విడుదల కంటే, 'మా' ఎన్నికల గురించే ఆడియన్స్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎంతమంది చైతన్యంతో ముందుకొచ్చి ఓటు వేస్తారనేది ఈరోజే తేలిపోతుంది.