అమరరాజా పరిశ్రమ…చిత్తూరు జిల్లాలో 16వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే భారీ పారి శ్రామిక సంస్థ. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశిస్తోంది. అమరరాజా ఉద్యోగుల్లో ఆందోళన నెలకుంది. పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని అమరరాజా పరిశ్రమపై ప్రభుత్వం ప్రధానం ఆరోపిస్తోంది.
‘ఔను! అమరరాజా ఫ్యాక్టరీని మేమే పంపిస్తున్నాం. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు… ప్రభుత్వమే దండం పెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటోంది’ అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అలాగే అటవీశాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ కూడా తనదైన స్టైల్‌లో పరిశ్రమపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే… ‘అమరరాజా సంస్థకు చెందిన తిరుపతి ఫ్యాక్టరీ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు’ అని తేల్చి చెప్పారు.
చెప్పడం సులభమే. కానీ వేలాది మంది ఉద్యోగులు, వాళ్లపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది మానసిక ఆందోళన గురించి ఒక్క నిమిషం ఆలోచించినా …ప్రభుత్వ పెద్దల నుంచి ఇలాంటి దురుసు మాటలు వచ్చేవి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్టుగా ఈ రెండు పరిశ్రమలు ఉన్నచోట మొక్కలు, చెట్లు, నేల, నీరు, గాలి, చుట్టుపక్కల అన్నీ కాలుష్యంతో నిండిపోయాయని అనుకుందాం. కానీ ఈ సమస్యలు కేవలం అమరరాజాకే పరిమితమా? అలాంటిదేమీ కాదే. కేవలం ప్రత్యర్థి పార్టీ నాయకుడికి చెందిన పరిశ్రమ కావడమే సమస్యల్లా అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెప్పిన విషయాలను వేదవాక్కుగా భావించడం మంచిదే. అయితే ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పరిశ్రమలకే వర్తింపజేయడంపైన్నే విమ ర్శలు. అమరరాజా పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదంటూ, పర్యావరణ పరిరక్షణ కోసమే ఇదంతా అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ప్రజలు విశ్వసించేలా లేవు.
ఎందుకంటే జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలకు సంబంధించిన పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలపై ఓ పథకం ప్రకారం చేస్తున్న దాడులు కక్షపూరితమైనవనే భావన ప్రజల్లో కలిగిస్తున్నాయి. పరిశ్రమల వల్ల పర్యావరణం కాలుష్యమవుతున్న మాట నిజమే. కానీ అంతకు మించి రాజకీయ కాలుష్యం వల్లే ఈ రోజు ప్రజలు నష్టపోతున్నారు. కేవలం రాజకీయ కాలుష్యం వల్లే అమరరాజా తరలింపునకే దారి తీస్తోందనే అభిప్రాయాలు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా నాటుకున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి కాలుష్యం లేదని విజయ్‌కుమార్, సజ్జల రామకృష్ణారెడ్డి సర్టిఫికెట్ ఇవ్వ గలరా? ఇదే పరిశ్రమ అధికార పార్టీ నేతలదై ఉంటే… ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుంది.
ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి, పరిశ్రమల స్థాపన ఊసే లేదనే విమ ర్శలు నెలకున్న పరిస్థితుల్లో రకరకాల సాకులతో ఉన్నవి కూడా తరలిపోయేలా చేయడం ఎలాంటి రాజకీయమో ఆలోచించు కోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకోడానికి ఏపీ ప్రజలు తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.