మూడు రాజధానులపై రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలలో విశ్వాసం పోతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దీనికి నిదర్శనం ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నవంబర్ 1 నుంచి చేపట్ట నున్న మహాపాదయాత్రపై అటు వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడమే. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు చివరికి న్యాయస్థానాల్లో వీగిపోతుండడం, అలాగే కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు అన్నీ కలిసి మూడు రాజధానుల ఏర్పాటుపై అనుమానాలు పెరుగుతున్నాయి.
తుళ్లూరు నుంచి తిరుమలకు అమరావతి పరిరక్షణ సమితి మహాపాదయాత్రకు సిద్ధమైంది. అయితే రాయలసీమలో హైకోర్టు, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాట్లను వ్యతిరేకిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఏ ధైర్యంతో రాయలసీమలో పాదయాత్ర చేయాలని అనుకుంటున్నది? ఆ ప్రాంతంలో తమను నిలదీస్తారనే ఆలోచన, భయం అమరావతి పరిరక్షణ సమితిలో ఉంటే ఇలాంటి రెచ్చగొట్టే పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర సమాజం నుంచి మద్దతు వెల్లువెత్తింది. అప్పట్లో టీడీపీ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు దీటైన సమాధానం ఇచ్చారు. అభివృద్ధినంతా అమరావతికే పరిమితం చేయడాన్ని ఆ రెండు ప్రాంతాల ప్రజానీకం తీవ్రంగా తప్పు పట్టింది.
కానీ రానురాను జగన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సీమ సమాజం అసంతృప్తిగా ఉంది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై చూపుతున్న శ్రద్ధ, అలాగే సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, కొన్ని విషయాల్లో సీమ వ్యతిరేక నిర్ణయాలను ఉద్యమకారులు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ సమాజం ఆగ్రహంగా ఉంది. ఇది సరైంది కాదని ఎంతగా చెబుతున్నా ప్రభుత్వం మొండిపట్టుదలకు పోవడంతో మూడు రాజధానుల ఏర్పాటుపై కూడా అనుమానాలు తలెత్తిన పరిస్థితి.
అలాగని అమరావతి విషయంలో వాళ్లెవరికీ సానుభూతి లేదు. కానీ మూడు రాజధానులు ఏర్పాటవుతాయనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని జగన్ ప్రభుత్వం విజయవంతంగా పోగొట్టగలుగుతోందని మాత్రం చెప్పొచ్చు. అందుకే అమరావతి పరిరక్షణ సమితి నిర్భయంగా తమ ప్రాంతంలోకి మహాపాదయాత్రగా వస్తున్నా సీమ ఉద్యమకారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారే తప్ప, తమ ప్రాంతానికి అన్యాయం చేయడం సబబా? అని ప్రశ్నించని నిస్సహాయ పరిస్థితి.
మహాపాదయాత్రను డీజీపీ ద్వారా అడ్డుకోవడం కాదు ఇతర ప్రాంత ప్రజానీకం నుంచి వ్యతిరేకత వచ్చేలా చేయగలిగి ఉండాలి. ఆ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తమను అభిమానించే వాళ్ల ఆదరణను కూడా కోల్పోతుండడం వైసీపీ ప్రత్యేకత. ఈ విషయాన్ని వాళ్లెప్పుడు తెలుసుకుంటారో మరి!