రియల్ ఎస్టేట్ వ్యాపార ఉద్యమాన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చడం వారికే చెల్లింది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌పై చేపట్టిన పోరాటం…ఎల్లో బ్యాచ్ మాటల్లో చెప్పాలంటే 825వ రోజుకు చేరింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి రాజధానిలో కొందరి ఆర్థిక మేడలు కుప్పకూలాయి.
రాజధాని భూములను కొన్ని ఎల్లో గద్దలు తక్కువ ధరకే కొట్టేసి, సొమ్ము చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ నిర్ణయం సహజంగానే కొంత మంది భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగించింది. అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగించాలంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్పాన్సర్డ్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శి స్తున్నారు. అమరావతిలో ఉద్యమం ఎల్లో మీడియా సృష్టే తప్ప, అక్కడ అంత సీన్ లేదని, ప్రజా మద్దతు కూడా లేదనేది వివిధ వర్గాలు చెబుతున్న మాట.
కేవలం భూములకు ధరలు పడిపోతాయనే ఆందోళనతో చేస్తున్న పోరాటమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలపై వారికి ఆరాటం లేదనే విమర్శలు లేకపోలేదు. అమరావతి రాజధాని పోరాటంపై తాజాగా సినిమా తెరకెక్కుతోంది. పోలీస్‌స్టేషన్‌లో అమరావతి మహిళల పోరాటంపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా అమరావతి మహిళా పాత్రధారి వాణీ విశ్వనాథ్ డైలాగ్స్‌ను చిత్రీకరించారు.
‘ఆనాడు స్వతంత్ర పోరాటంలో అయిన వారంతా దారుణంగా చనిపోతున్నా ప్రజలు వందేమాతం అన్నారే తప్ప …నా అక్క, నా అన్న, నా చెల్లి అనలేదు. అదీ మా సంస్కృతి. అదే మా స్ఫూర్తి. మేం చేస్తున్న ఉద్యమం కూడా మా మొగుళ్ల కోసం కాదు… రాష్ట్ర ప్రజలందరి కోసం’ అని వాణీ విశ్వనాథ్ డైలాగ్ చెప్పారు.
నిజంగా వాళ్ల పోరాటం రాష్ట్ర ప్రజలందరి కోసమైతే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులని ప్రభుత్వం చెబుతుంటే, అందుకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమాన్ని ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం పేరుతో కేవలం కొంత మంది ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయం ప్రజలందరికి తెలిసిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధాని మహిళా రైతులనే తెరపైకి తెచ్చి సినిమా తీసి వుంటే బాగుండేదని, వారి కంటే వాణీ విశ్వనాథ్ ఏమంత గొప్పగా నటిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధాని మహిళా రైతులనే క్యారెక్టర్లగా పెట్టి వుంటే, సినిమాలో పాత్రలు జీవించి వుండేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా అమరావతి పేరుతో 24 గంటలూ సినిమాను తలపించే డ్రామా నడుస్తుంటే, ప్రత్యేకంగా రెండు గంటల సినిమా ఎందుకు చిత్రీకరిస్తున్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.