ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి 160 సీట్లు వస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతుంటే, మరో నాయుడి లెక్కలు మాత్రం షాక్ ఇచ్చాయి. టీడీఎల్సీ ఉపనేత నిమ్మల రామానాయుడు రాబోవు ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లపై చెప్పిన గణాంకాలు సొంత పార్టీని తీవ్ర నిరాశకు గురి చేసేలా ఉన్నాయి. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూనే, మరోవైపు 100-110 లోపు మాత్రమే టీడీపీకి అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది.
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో టీడీఎల్పీ ఉప నేత రామానాయుడు మనసులో మాట బయట పెట్టారు. తాము అధికారంలోకి వస్తామని చెబుతూనే, మరోవైపు వైసీపీని ఆయన తక్కువ అంచనా వేయకపోవడం మెచ్చకోదగ్గ విషయమే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నా వైసీపీకి 67 అసెంబ్లీ సీట్లు దక్కాయి. మిగిలిన 108 సీట్లు టీడీపీ కూటమికి దక్కాయి. ఇప్పుడు రామానాయుడు చెబుతున్న లెక్కలు కూడా అంతే. ఇంటర్వ్యూలో ఆర్కే అడిగిన ప్రశ్నకు రామానాయుడి సమాధానం ఏంటో తెలుసుకుందాం.
‘టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే 150-160 సీట్లు వస్తాయి. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100-110 వస్తాయి. కాపులు అందరినీ కలుపుకొని వెళ్లాలి. అప్పుడే విజయం సాధిస్తారు. నాకు కూడా అందరి ఓట్లు పడితేనే గెలిచాను’ అని రామానాయుడు చెప్పారు.
రామానాయుడు చెప్పే ప్రకారం వైసీపీ బలంగా ఉందనే అర్థాన్ని ధ్వనిస్తోంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100-110 సీట్లు వస్తాయని రామానాయుడే చెబుతుంటే… ఆ పార్టీ నేతల నైతిక స్థైర్యం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతెందుకు అచ్చెన్నాయుడు ఇటీవలే 160 సీట్లు వస్తాయని చెప్పారు. ఇవాళ రామానాయుడు 50 నుంచి 60 సీట్లు తగ్గించి చెప్పారని, ఎన్నికల నాటికి మరెంతగా తగ్గుతుందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు చెబుతున్నారు.
రామానాయుడి అంచనా ఆ పార్టీ వాళ్లకే షాక్ ఇచ్చిందనేది వాస్తవం. ఎందుకంటే టీడీపీ ప్రచారం చేస్తున్నట్టూ… వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతే ఉంటే ఆ పార్టీకి కేవలం 100 సీట్లే ఎందుకొస్తాయనే ప్రశ్నకు సమాధానం ఏమని చెబుతారు?