వృద్ధ నారీ పతివ్రతః అంటారు పెద్దలు. దీని అర్థం విడమరచి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కూడా అంతే. రాజకీయాల్లో ప్రజల నుంచి, పరోక్షంగా గానీ గెలిచి నాయకుడిగా వెలుగొందే ప్రభ కోల్పోయిన తర్వాత.. అనేకమంది క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్ అవుతుంటారు. అలా రిటైర్ అయిన తర్వాత.. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటారు.
కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో అనేక హోదాలు, పదవులు అనుభవించి.. అప్పట్లో ఎన్నడూ గుర్తుకురాని రాజకీయాల్లో విలువల గురించి కొత్తగా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజకీయాలనుంచి రిటైర్ అయిన గులాం నబీ ఆజాద్ మాటలు కూడా అదే తరహాలో ఉంటున్నాయి.
జమ్మూకాశ్మీర్ కు ఒకప్పట్లో ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ఆజాద్ ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రకంపనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాశ్మీర్ ప్రాంతంలో నెలకొన్న అశాంతికి ప్రధానంగా పాకిస్తాన్, వారు ప్రేరేపించిన ఉగ్రవాదులు కారణం అని అంటూనే.. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు కారణమేనని చెప్పారు.
కాశ్మీర్ లో ఇవాళ ఉన్న దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ కారణం కావచ్చు గాక.. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ మాత్రమే కారణం అని వాదించేవారూ బోలెడు మంది ఉన్నారు. కానీ ఈ సీనియర్ నాయకుడికి తాను క్రియాశీల రాజకీయాలనుంచి రిటైర్ అయిన తర్వాత గానీ ఆ సంగతి గుర్తు రాకపోవడమే తమాషాగా ఉంది.
గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఇటీవలి పరిణామాలలో కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. రాహుల్‌కు వ్యతిరేకంగా, సోనియా కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న సీనియర్ నాయకుల్లో జీ-23 నాయకుల్లో ఆజాద్ కూడా ఒకరు.
కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ, ప్రధాని మోడీతో కూడా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి ఆజాద్. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్టీలో ఇతరుల స్పందన ఎలా ఉన్నా.. అదే ప్రాంతానికి చెందిన ఆజాద్ పెద్దగా ప్రతిఘటించలేదు కూడా. ఇప్పుడు కూడా.. కాశ్మీర్ లో పరిస్థితి గురించి వామపక్షాలు, మోడీ వ్యతిరేకులు నానా యాగీ చేస్తున్నప్పటికీ.. ఆజాద్ పల్లెత్తు మాట అనకుండా ఉండిపోతున్నారు. తాజాగా, ప్రజల్లో విభజన సృష్టించడానికి ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుందంటూ ఆయన జనాంతికంగా ఒక మాట కూడా అనేశారు.
అలాంటి ఆజాద్ కాంగ్రెస్ తప్పిదాలు చేసిందంటూ, తాను రిటైరైన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ వైభవస్థితి మొత్తం అంతరించిపోయిన తర్వాత.. ఆ పార్టీ వలన ఇక ఎలాంటి ఉపయోగమూ ఉండగల పరిస్థితే లేకుండా పోయాక అనడమే చిత్రంగా కనిపిస్తోంది.