నువ్వీ దరినీ నేనీ దరిని క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అని పాత తెలుగు సినిమాలో పాట ఒకటి ఉంది. అలాంటి పాటను కాస్తా మార్చి విశాఖ రాజకీయ పార్టీలు పాడుకుంటున్నాయిపుడు. మేయరమ్మ కలిపింది అందరినీ అని. అవును ఏపీలో చూసినా ఎక్కడ చూసినా అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య ఉప్పూ నిప్పులా సీన్ ఉంటుంది. అంతే కాదు, జనసేన సైతం వైసీపీ మీదనే బాణాలు వేస్తుంది.
కామ్రేడ్స్, బీజేపీ అయితే చెప్పాల్సిన పని లేదు. అలా అందరూ కలసి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒకరి మీద ఒకరు విమర్శల జడివాన కురిపించుకుంటారు. ఇక జీవీఎంసీ మీటింగ్ జరిగినా ఇంతే సంగతులు. అలాంటిది చాలా కాలం తరువాత అన్ని పార్టీలు కలసి జెండాలను పక్కన పెట్టి అజెండాను కూడా కాసేపు అలా పెట్టేసి ఒకే చోటకు చేరారు.
అలా అందరినీ కలిపిన ఘనత విశాఖ మేయరమ్మ గొలగాని హరి వెంకటకుమారి దక్కించుకున్నారు. సందర్భం ఏంటి అంటే ఆమె విశాఖ మేయర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది కావడం. ఇక ఆదివారం, అహ్లాదకరమైన వాతావరణంలో రాజకీయ పార్టీల నేతలు అందరితో కలసి అత్మీయ సమావేశాన్ని ఆమె అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా అందరూ కలసి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరిని ఒకరు మెచ్చుకున్నారు. మనసులో అసలైన మాటలు అలా బయటకు వచ్చాయి. దీని మీద కరడు కట్టిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు అయితే ఇలాంటి సమావేశాన్ని తన రాజకీయ జీవితంలో ఇంతవరకూ చూడలేదు అనేశారు.
అంతా కలసి విశాఖ అభివృద్ధి కోసం పనిచేద్దామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపునకు ఓకే అనేశారు నేతలు. మేయర్ విశాఖను ప్రగతి బాటన నడిపిస్తే తాము తప్పనిసరిగా సహకరిస్తామని విపక్షాలు చెప్పుకొచ్చాయి. ఈ ఆనంద సమయాన మేయరమ్మ కూడా భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
విశాఖకు అతి పెద్ద ప్రాజెక్ట్ ని తన పదవీ కాలంలో తీసుకొచ్చి తన పేరుని సార్ధకం చేసుకుంటాను అని పేర్కోనడం విశేషం. మొత్తానికి రాజకీయాలకు అతీతంగా అంతా కలసి మెలసి ఉండడం విశాఖవాసులకు కూడా కొత్త అనుభూతి అంటే ఆశ్చర్యం లేదుగా.