పూర్వకాలంలో అంటే రాచరికం అమల్లో ఉన్న రోజుల్లో ప్రతి రాజుకు, చక్రవర్తికి ప్రత్యేకంగా ఓ గురువు ఉండేవాడు. ఇలాంటి సంప్రదాయం పురాణాల్లోనూ కనబడుతుంది. ఈ గురువులు ధార్మిక విషయాల్లో రాజులకు మార్గదర్శనం చేసేవారు. యుద్ధాలకు, రాజు కుటుంబంలో జరిగే శుభ కార్యాలకు ముహూర్తాలు పెట్టేవారు. మొత్తం మీద ఆధ్యాత్మిక సలహాదారులుగా ఉండేవారు.
ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ ముఖ్యమంత్రులకు. ప్రధానమంత్రులకూ గురువులున్నారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల్లో గురువులు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. తెలంగాణా సీఎం కేసీఆర్ కు మొన్నటివరకు త్రిదండి చినజీయర్ స్వామీజీ గురువుగా ఉండేవారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు విశాఖ శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర స్వామి గురువుగా ఉన్నారు.
కేసీఆర్ కూడా అప్పుడప్పుడూ ఆయన దగ్గరకు వెళతాడనుకోండి. అది వేరే విషయం. కేసీఆర్ – చినజీయరు స్వామి మధ్య చిచ్చు రేగిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 28 యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ఉద్ఘాటన కారక్రమం ఉంది. దానికి కేసీఆర్ వెళుతున్నారు. ఈ విషయం అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ చినజీయర్ ప్రస్తావన ఎక్కడా లేదు. మరి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులన్నీ చినజీయర్ సలహాలు సూచలతోనే కేసీఆర్ చేశారు.
చాలాసార్లు తనవెంట యాదాద్రికి కూడా తీసుకెళ్లారు. ఆలయానికి సంబంధించిన మంచీ చెడు మాట్లాడారు. ముచ్చింతల్ లో రామానుజ విగ్రహ ఏర్పాట్లకు, ఆ సందర్భంగా జరిగిన ఉత్సవాలకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసి సహకరించింది. గతంలో చినజీయర్ స్వామి కి పెద్ద పీట వేసిన కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన హోమం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, యాదాద్రి ఆలయ పునఃప్రారంభం ఇలా అన్నిటికీ చిన్న జీయర్ స్వామి పెట్టిన ముహూర్తాలను ఖరారు చేసి, ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలను నిర్వహించారు. ఇంతటి జిగ్రీ దోస్తుల మధ్య చెడింది.
రామానుజ విగ్రహావిష్కరణ నుంచి చినజీయర్ మీద కేసీఆర్ కు పీకల దాకా కోపం ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈమధ్య సమ్మక్క సారలమ్మ వివాదం జీయర్ మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది తాను 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి సొంత లాభం కోసం బయటకు విడుదల చేశారని జీయర్ ఈమధ్య మీడియా సమావేశంలో చెప్పారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం కూడా పెట్టిన చిన్న జీయర్ స్వామిని యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి పిలవలేదని సమాచారం.
సమ్మక్క సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పిన చినజీయర్ స్వామి కావాలని కొంతమంది తన వీడియోలను ఎడిట్ చేసి స్వప్రయోజనాల కోసం విడుదల చేశారని చెప్పడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. అసలు ఈ వివాదాన్ని ఎందుకు తెరమీదకు తీసుకువచ్చారు అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని పేర్కొన్నారు. చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ కు సంబంధాలు బెడిసి కొట్టిన నేపథ్యంలో చినజీయర్ స్వామి పై ప్రచారం చేస్తున్న వారు ఎవరు అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.
ఇక ఇదే సమయంలో యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి తనకు ఆహ్వానం అందలేదని పేర్కొన్న చినజీయర్ స్వామి పిలిస్తే వెళతానని లేకుంటే చూసి ఆనందిస్తాం అంటూ ప్రకటించారు. అంటే చినజీయర్ స్వామి కి కెసిఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చకు చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి.
మరి ఈ జిగ్రీ దోస్తుల మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందో. పూడిపోతుందో చెప్పలేం. ఇక ఇద్దరి దారులు వేరైతే సెంటిమెంట్లు, ఆధ్యాత్మిక నమ్మకాలు ఎక్కువగా ఉన్న కేసీఆర్ మరో గురువును వెదుక్కుంటారా? లేదా స్వరూపేంద్రనంద స్వామినే తన గురువుగా చేసుకుంటారా? కేసీఆర్ కు ఆయన మీద కూడా భక్తి భావం ఉంది.
ఆయనకు ప్రైమ్ ఏరియా అయిన హైదరాబాదులోని కోకాపేటలో ఎకరం రూపాయి చొప్పున ఆశ్రమ నిర్మాణానికి రెండు ఎకరాలు ఇచ్చారు.