లాంగ్ మార్చ్ అంటూ “షార్ట్”గా వైజాగ్ లో చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరును వైఎస్ఆర్సీపీ తప్పుబట్టింది. విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ, వ్యక్తిగత విమర్శలకు దిగడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడ్డం సరికాదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఈ సందర్భంగా పవన్ పై సూటి విమర్శలు చేశారు అంబటి.
“తాట తీస్తామన్నారు, నాలుకలు కోస్తామన్నారు.. ఏం మాట్లాడుతున్నారో అర్థమౌతోందా? రెండు చోట్ల మీరు (పవన్) నిలబడితే ప్రజలు మీ తాట తీశారు. మూల కూర్చోబెడతా అని పవన్ అంటుంటారు. ఆయన్నే మూల కూర్చోబెట్టారు ప్రజలు. ఏకంగా ఒంగోబెట్టారు, పడుకోబెట్టారు. తాట తీయడం అంటే ఆర్నెళ్లకు ఓసారి గడ్డం గీయడం కాదు. మీరు తాట తీస్తానంటే ఎవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరు. మీ నోరు పెద్దది, మీ నోరు కంటే వెయ్యి రెట్లు పెద్దది మా నోరు. అది గుర్తుపెట్టుకోవాలి.”
టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడం పవన్ ఇంకా మానలేదన్నారు అంబటి. ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారని, ఇకనైనా సొంతగా ఆలోచించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటి చేయాలని పవన్ కు హితబోధ చేశారు. జగన్ పై ఆరోపణలు చేసేముందు, జగన్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
“అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు స్క్రిప్ట్ తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ చదివిన దౌర్భాగ్యమైన పరిస్థితి పవన్ కు ఏర్పడింది. జగన్ జైల్లో ఉన్నారని చెబుతున్నారు. కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ మీరు కొత్తగా కనిబెట్టిన విషయాలు కాదు. ప్రజలకు తెలుసు. తెలిసి మరీ అఖండ మెజారిటీ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఆ విషయం మరిచిపోతున్నారు. జగన్ పై వస్తున్నవన్నీ అవాస్తవాలు, అపోహలు అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. మీరు కూడా గుర్తిస్తే మంచిది.”
ఇకనైనా పవన్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు అంబటి. తాట తీస్తానంటూ పదేపదే చెప్పుకునే పవన్ కు ప్రజలే తాట తీశారని, తాటి చాప చేరారని ఎద్దేవా చేసిన అంబటి.. ఇకనైనా జనసేనాని తన మాటల్ని అదుపులు పెట్టుకొని, ఉన్న పరువుని కాపాడుకోవాలని సూచించారు.