ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో భారీ సభను నిర్వహించాలని తెలంగాణ బీజేపీ భావించింది. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఆ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించింది. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ చాన్నాళ్లుగా గురి పెట్టి ఉన్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో ఉనికి చాటినప్పటి నుంచి తెలంగాణలో తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అంటూ కమలం పార్టీ వాళ్లు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే గట్టి యాక్టివిటీస్ మాత్రం లేవు.
ఈ క్రమంలో అమిత్ షా సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎంలను హడలెత్తించాలని భారతీయ జనతా పార్టీ భావించింది. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలను అమిత్ షా సభను విజయవంతం చేయడం ద్వారా మానేలా చేయాలన్నట్టుగా బీజేపీ వ్యూహం రచించింది. అమిత్ షా హైదరాబాద్ వచ్చి అటు కేసీఆర్ కు, ఇటు ఒవైసీకి గట్టి హెచ్చరికలు జారీ చేస్తారని బీజేపీ కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు.
అయితే కరోనా ప్రభావం చివరకు ఈ సభ మీద కూడా పడినట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం దృష్ట్యా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటం మంచిది కాదనే అభిప్రాయాలున్నాయి. చాలా దేశాల్లో కరోనా విస్తరించడానికి కారణం కూడా అలాంటి సమూహాలే అనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలూ గట్రా నిర్వహించడం అంత సమంజసం కాదు.
ఇలాంటి నేపథ్యంలో..ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తమ పార్టీ వాళ్లకు ఈ మేరకు సలహా ఇచ్చారట. సభలు, సమావేశాలు కొన్నాళ్లు వాయిదా వేసుకొమ్మని సూచించారట. ఈ నేపథ్యంలో.. 15వ తేదీన హైదరాబాద్ లో జరగాల్సిన అమిత్ షా పర్యటన రద్దు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది వాయిదా మాత్రమే అని, కరోనా ప్రభావం తగ్గాకా..అమిత్ షా పర్యటన సాగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.