పూసపాటి వారి వంశంలో అత్యంత శక్తిమంతుడు, పలుమార్లు రాష్ట్రమంత్రిగా, అలాగే కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అశోక్ గజపతిరాజుకు జగన్ గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయన రాజ్యానికే ఎసరు పెట్టేలా అతి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన అన్నగారైన దివంగత ఆనందగజపతిరాజు కుమార్తె సంచయిత గజపతి రాజు ఉత్తరాంధ్రాలో అతి పెద్ద పుణ్య క్షేత్రం సిం హాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ అయిపోయారు.
ప్రస్తుతం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న అశోక్ ఒక్కసారిగా మాజీ అయిపోయారు. అతి పెద్ద నారసింహ క్షేత్రం అనువంశిక ధర్మకర్తలుగా పూసపాటి వారసులే ఉంటూ వచ్చారు. పీవీజీ రాజు తరువాత ఆనందగజపతిరాజు, ఆయన మరణాంతరం అశోక్ ఈ బాధ్యతలు చూస్తున్నారు.
ఉన్నట్లుండి ఇపుడు సంచయిత గజపతి రాజు రంగప్రవేశం చేయడంతో కధ మొత్తం అడ్డం తిరిగిందనుకోవాలి. ఎందుకంటే ఆమె ఆనందగజపతిరాజు, ఉమాగజపతిరాజుల కుమార్తె. మూడు దశాబ్దాల క్రితం ఈ ఇద్దరికీ విడాకులు అయ్యాయి. ఇక సంచయిత మాత్రం తన తండ్రి రాజకీయ వారసత్వం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఆమె గత ఏడాది బీజేపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారనుకున్నారు. హఠాత్తుగా ఆమె ఇపుడు వైసీపీ సర్కార్ వాణిని బలపరుస్తూ మూడు రాజధానులు భేష్ అనేశారు. బాబాయి అశోక్ కి ఆ విధంగా ఎదురు నిలిచారనుకుంటే ఇపుడు ఆమె ఏకంగా ఆయన పదవికే ఏసరు పెట్టారు.
ఆమెను జగన్ జాగ్రత్తగానే ఈ పదవికి ఎంపిక చేశారనుకోవాలి. పూసపాటి వారసురాలిగా ఆమె హక్కుని ఎవరూ కాదనరు. అదే సమయంలో అశోక్ సైడ్ అయిపోయారు. ఇపుడు సంచయిత పూసపాటి వారి కుటుంబంలో, రాజుల కోటలో పాగా వేశారు. వేలాది భూములు కలిగిన మాన్సాస్ ట్రస్ట్ కి చైర్ పర్సన్ గా కూడా ఆమె బాధ్యతలు స్వీకరిస్తాని అంటున్నారు. అదే జరిగితే అశోక్ కి రాజకీయంగా కంటే ఇది అతి పెద్ద దెబ్బ అవుతుంది.