తమిళ సినిమా తడమ్ ఇప్పటికే తెలుగులో రెడ్ పేరుతో రీమేక్ అవుతూ ఉంది. అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయంలో తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో రామ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తూ ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా హిందీ వెర్షన్ రూపొందుతూ ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 20న తడమ్ హిందీ రీమేక్ విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. హిందీలో ఈ సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో హిందీలో సూపర్ హిట్ ను కొట్టిన ప్రొడ్యూసర్లే ఇప్పుడు తడమ్ ను రీమేక్ చేస్తూ ఉండటం గమనార్హం. సౌత్ లో హిట్టైన సినిమా రీమేక్ తో భారీగా కాసుల వర్షం కురవడంతో ఇప్పుడు మరో సినిమాను వారు హిందీలో రీమేక్ చేస్తున్నట్టుగా ఉన్నారు.
ఇప్పటికే తడమ్ సినిమాను హిందీలోకి అనువదించేశారు. దాన్ని ఆన్ లైన్లో అందుబాటులో ఉంచారు. అయినా హిందీ వాళ్లు దాన్ని పట్టించుకోకుండా.. రీమేక్ ప్రాజెక్టును తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇలా ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుండటం వల్ల రామ్ తెలుగు వెర్షన్ హిందీ డబ్బింగ్ మార్కెట్ పై ప్రభావం పడే అవకాశాలూ ఉన్నాయి. ఇది వరకూ రామ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డిజాస్టర్లు అయినా, హిందీ లోకి డబ్బింగ్ అయ్యి, యూట్యూబ్ లో మాత్రం హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అటు హిందీలోకి తడమ్ డబ్బింగ్, తడమ్ హిందీ రీమేక్ ల ప్రభావం రెడ్ పై పడుతుందేమో!