ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను ఇప్పటికే ఒక సారి చేపట్టి, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దేశ వ్యాప్తంగా చిత్తుగా ఓడినందుకు బాధ్యతగా రాజీనామా చేసిన రాహుల్ గాంధీ విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతూ ఉంది. రాహుల్ చేసింది ఉత్తుత్తి రాజీనామానే అని, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గాంధీల కనుసన్నల్లో ఉంటుందని.. ఆయన మళ్లీ ఆ బాధ్యతలు తీసుకోవచ్చనే అభిప్రాయాలే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ బాధ్యతలు రాహులే తీసుకోవాలని వారు చెబుతున్నారు.
ఇక సోనియాగాంధీ కూడా తనయుడి రాజీనామా తర్వాత ఎవరికీ పగ్గాలు అప్పగించకుండా మళ్లీ తనే తీసుకున్నారు. అదేమంటే తాత్కాలికంగా అని చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి ప్రకటన రావడం లేదు. ఈ నేపథ్యంలో రాహులే మళ్లీ పగ్గాలు చేపట్టడం కోసం సోనియా వేచి ఉన్నారనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
అయితే ఆ పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు రాహుల్. తను మళ్లీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టే అవకాశం లేదని ఆయన తేల్చేశారు తాజాగా. పార్టీ లోని కొంతమంది మళ్లీ కోరుతున్నప్పటికీ.. రాహుల్ మాత్రం అందుకు నో అంటున్నారు. తను వదిలించుకున్న బాధ్యతలను మరోసారి చేపట్టే అవకాశాలు లేవని, తనకు ఆ ఉద్దేశం లేదని రాహుల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే సోనియాగాంధీ ఒత్తిడి చేస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు మాత్రం రాహుల్ సమాధానం దాట వేశారు. సూటిగా స్పందించలేదు. త్వరలో ఏఐసీసీ సమావేశం జరగనుందని, ఆ లోపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఒక అభిప్రాయానికి వచ్చి, కొత్త అధ్యక్షుడి విషయంలో క్లారిటీ ఇవ్వనుందని సమాచారం.