ఇప్పటికే మూడు సార్లు వారికి డెత్ వారెంట్ జారీ అయ్యింది. దేశ రాజధానిలో అత్యంత కిరాతకంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన వారికి ఉరి శిక్ష పడి చాలా కాలం అయిన సంగతి తెలిసిందే. అయితే అమలు మాత్రం ఇప్పటికీ జరగలేదు. ఇటీవల హైదరాబాద్ లో దిశపై అఘాయిత్యం నేపథ్యంలో.. వారి ఉరి శిక్ష అమలుపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసుల ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి వారు కూడా రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే కోర్టు వారికి మూడు సార్లు డెత్ వారెంట్ జారీ చేసింది. వారికి పడ్డ ఉరిశిక్ష అమలును చేయాలని మూడు సార్లు తేదీలు ఇచ్చింది. అయితే ఆ దోషుల లాయర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక్కోరి తరఫున ఒక్కోసారి క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్ర పతి వద్దకు పంపడం, ఆ తర్వాత దానిపై కోర్టుకు వెళ్లడం. ఇప్పటి వరకూ మూడు సార్లూ అలా వ్యూహాత్మకంగా వ్యవహరించి కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ అమలు కాకుండా చేశారు. ఈ క్రమంలో మార్చి రెండో తేదీన వీరి ఉరి శిక్ష అమలు వాయిదా పడింది.
అయితే నిర్భయ తరఫున లాయర్ మరోసారి ఈ విషయంలో కోర్టును విన్నవించనున్నారట. వారి ఉరి శిక్ష అమలుకు మరో తేదీతో డెత్ వారెంట్ జారీ చేయాలని కోరనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే నలుగురి క్షమాభిక్ష పిటిషన్లనూ రాష్ట్రపతి వెనక్కు పంపారు. ఆ పై వీరు మళ్లీ కోర్టును ఆశ్రయించడమూ జరిగింది. అయితే పవన్ గుప్తా అనే ఒకడికి మాత్రం ఇంకా కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సారి డెత్ వారెంట్ జారీ అయ్యాకా.. అతడు రాష్ట్రపతి ఉత్తర్వులపై కోర్టుకు ఎక్కే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి ఉత్తర్వులను ఏమని ఇస్తుంది, పవన్ గుప్తా పిటిషన్ గురించి ముందే వాకబు చేసి ఈ సారి కోర్టు డెత్ వారెంట్ జారీ చేస్తుందా? లేక తదుపరి తేదీని ప్రకటించినా.. మళ్లీ నిర్భయ హంతకులు ఇంకోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందా? అనే అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేనట్టే. అయితే నిర్భయ కుటుంబం తరఫు న్యాయవాది మాత్రం ఉరిశిక్ష అమలుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా ప్రకటించారు.