గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన అన్ని అస్త్రాలనూ సంధిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జాతీయ స్థాయి అన్ చార్జి రావడమే పెద్ద ఆశ్చర్యం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్త భూపేంద్ర యాదవ్ జీహెచ్ఎంసీ బాధ్యతలు తీసుకున్నప్పుడే పలువురు ఆశ్చర్యపోయారు. సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలనేవి ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యతగా తీసుకునేవి.
తెలుగు రాష్ట్రాల్లో ఇన్నాళ్లూ అలాంటి రాజకీయాలే చేశారంతా. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అంత కన్నా కింది స్థాయి నేతలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఆ పై మంత్రులు జిల్లాల వారీగా బాధ్యతలు తీసుకుని పని చేస్తూ ఉంటారు.
స్థానిక ఎన్నికలు లోకల్ నాయకత్వాన్నికి ప్రజలతో ఎంత సంబంధాలు ఉన్నాయనే అంశానికి పరీక్షగా నిలుస్తూ ఉంటాయి. అయితే బీజేపీ మాత్రం గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నిక విషయంలో.. జాతీయ ఇన్ చార్జిని పిలిపించుకుంది. అంతే కాదు.. వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు గ్రేటర్ లో వీధివీధీ తిరిగి ప్రచారం చేస్తున్నారు!
వీరు గాక పక్క రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రసంగాలకు కూడా వెనుకాడటం లేదు. అందరి ప్రచారం తీరు ఒక్కటే.. మాటలతో మంటలు పుట్టించేస్తున్నారు.
ఇలా దేశంలో ఉన్న తమ ఫైర్ బ్రాండ్లందరినీ గ్రేటర్ పరిధికి రప్పించి బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించగా, నేడు ఆ పార్టీ ముఖ్య నేత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా చార్మినార్ వద్ద ఉన్న భాగ్య లక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారట. అలాగే బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలూ, ర్యాలీలు చేపడుతున్నారు.
జాతీయాధ్యక్షుడి నుంచి గల్లీ లీడర్ వరకూ వీళ్లు లేదు అనుకుండా.. ప్రతి ఒక్కరూ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అన్ని అస్త్రాలనూ వాడేసింది గ్రేటర్ ఎన్నికల్లో. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో!