దేవాలయాల నిరర్థక, ఆక్రమణకు గురి అవుతున్న భూముల వేలం విషయంలో జగన్ సర్కార్ తడబాటుకు గురవుతోంది. ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక వెనుకడుగు వేయకూడదు. ముఖ్యంగా ఆలయాల భూముల అమ్మకానికి వెళితే …. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో జగన్ సర్కార్‌కు బాగా తెలుసు.
అలాంటప్పుడు ఆచితూచి వ్యవహరించడానికి బదులు, ప్రతిసారి ప్రతిపక్షాల చేతికి ఆయుధాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవడంపై సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు వస్తున్నాయి. గతంలో టీటీడీ నిరర్థక ఆస్తులు అమ్మాలని టీడీపీ హయాంలో నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలని జగన్ పాలనలోని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ, జనసేన, టీడీపీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా జగన్ సర్కార్ ఓ పథకం నిర్ణయాలు తీసుకుంటోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టగానే ….సీఎం ఆదేశాల మేరకు టీటీడీ వెనక్కి తగ్గింది. దీంతో ఇది తమ విజయంగా ప్రతిపక్షాలు చెప్పుకున్నాయి.
తాజాగా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి సంబంధించిన భూముల వేలం విషయంలోనూ అదే పునరావృతం అయింది. భూముల వేలం ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు మఠం ఏఏవో మాధవశెట్టి తెలిపారు.
ప్రభుత్వం నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, తెలంగాణలోని 208.51 ఎకరాల భూమి విక్రయ వేలంపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్, నివర్ తుపాను దృష్ట్యా వేలాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.
జనసేనాని పవన్ ఈ విషయాన్ని చక్కగా రాజకీయం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆలయాల భూములను కాపాడాలని కోరుతూ ఓ ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వం వేలం ప్రక్రియను వాయిదా వేయగానే మళ్లీ పవన్ వార్తలకెక్కారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేసేలా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
గతంలో టీటీడీ ఆస్తుల అమ్మకం, శ్రీవారి సొమ్మును బాండ్ల రూపంలో మళ్లించాలనే నిర్ణయాలపై, భక్తుల నుంచి వచ్చిన నిరసనతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. మంత్రాలయం మఠం భూముల వేలం విషయంలోనూ ఇది మరోసారి రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు.
అసలు ఆలయాల నిరర్థక, ఆక్రమణకు గురి అవుతున్న భూములను ఏం చేయాలో ముందు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వైఖరి ఉన్నట్టు కనిపించడం లేదు. గత పాలనలోనే ఆలయాల భూములను విక్రయించాలని జీవోలు జారీ అయినప్పటికీ, ఇప్పుడు వాటిని అమలు విషయానికి వచ్చే సరికి జగన్ సర్కార్ దోషిగా నిలబడాల్సి వస్తోంది.
ఇదంతా జగన్ సర్కార్ అసమర్థతగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ క్రిస్టియన్ కావడంతో మతపరమైన విద్వేషాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు ఈజీ అయిందంటున్నారు.
అందులోనూ జగన్ ప్రభుత్వ భయం కూడా ప్రతిపక్షాలకు మరింత బలం ఇస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం తాను భయపడే విషయాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
ప్రతిసారి ఆలయాల భూముల విక్రయానికి వేలం నోటీసు ఇవ్వడం, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కాగానే, తిరిగి వెనక్కి తగ్గి పరువు పోగొట్టుకోవడం కంటే …మరేదైనా మార్గాన్ని వెతుక్కోవడం ఉత్తమమని చెప్పొచ్చు.