అమ్మ ఒడికి అటు ఇటు

ఒకపక్కన పంచాయతీ ఎన్నికల పంచాయతీ తెగడం లేదు. చేయను అన్న ఎన్నికల చేస్తాను అంటోంది. చేయమన్న ప్రభుత్వం ఇప్పుడు వద్దు అంటోంది. జగన్ అప్పుడు చేయమన్నారు ఇప్పుడు వద్దంటున్నారని, 'దేశం' తో సామాజిక బంధాలు…

ఒకపక్కన పంచాయతీ ఎన్నికల పంచాయతీ తెగడం లేదు. చేయను అన్న ఎన్నికల చేస్తాను అంటోంది. చేయమన్న ప్రభుత్వం ఇప్పుడు వద్దు అంటోంది. జగన్ అప్పుడు చేయమన్నారు ఇప్పుడు వద్దంటున్నారని, 'దేశం' తో సామాజిక బంధాలు పెనవేసుకున్న మీడియా  షరా మామూలుగా రాసుకుంటూపోతోంది. అంతే కానీ చేయను అన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎందుకు చేస్తాను అంటోంది అన్న విషయం మాత్రం ప్రస్తావించడం లేదు.

ఈ సంగతి అలా వుంచితే ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం లోలోపల ఓ మీమాంసతో కిందా మీదా అవుతోందని రాజకీయ వర్గాల బోగట్టా. పైకి తమకు నచ్చిన ఎన్నికల కమిషనర్ కు వత్తాసు పలుకుతూ ఎన్నికలు తక్షణం జరపాలని బీరాలు పోతోంది కానీ, లోలోపల మాత్రం ఓ పాయింట్ చుట్టూ ఆలోచనలు సాగిస్తోంది. అదేంటి అంటే అమ్మఒడి పథకం.

జనవరిలో అమ్మఒడి డబ్బులు జనాల ఖాతాల్లో పడాల్సి వుంది. ఈ అమ్మఒడికి ముందు ఎన్నికలు జరిగితే బెటర్ నా? తరువాత జరిగితే బెటర్ నా? అనేదే తెలుగుదేశం  పార్టీ  సమస్య. ఎందుకంటే అమ్మఒడికి ముందు ఎన్నికలు పెడితే, అది ఎదర వుంటుంది కాబట్టి, జనం ఎందుకయినా మంచిదని వైకాపాకే ఓట్లు వేస్తారేమో అనే ఆలోచన. లేదూ అమ్మఒడి తరువాత పెడితే, రెండో సారి వరుసగా డబ్బులు అందుకున్న ఆలోచనతో అటే ఓటు వేస్తారేమో అన్న అనుమానం మరో వైపు తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తున్నట్లు  రాజకీయ వర్గాల బోగట్టా.

జగన్ ప్రభుత్వం ప్రతినెలా ఏదో విధంగా  జనం ఖాతాలోకి డబ్బులు వేస్తూనే వున్నారు. ఏడాది కాలంగా జనం దీనికి బాగా అలవాటు పడిపోయారు. పైగా వచ్చిన ఫ్యామిలీలకే డబ్బులు వస్తూనే వున్న వైనం కూడా వుంది. ఓ బిసి ఫ్యామిలీ వుందీ అంటే అమ్మ ఒడి, రైతు భరోసా, లేదా కౌలు భరోసా, ఆదరణ, ఇలా రకరకాలుగా అమౌంట్ లు వచ్చి పడుతున్నాయి. ఏడాది కాలంగా సాగుతున్న ఈ నగదు పంపిణీ కార్యక్రమానికి అలవాటు పడిన జనం అమ్మఒడి ముందు ఎన్నికలు పెడితే ఏం చేస్తారో? వెనుక ఎన్నికలు పెడితే ఏం చేస్తారో అన్నదే తెలుగుదేశం అనుమానంగా వుంది.

ఎందుకంటే సర్పంచ్ లుగా ఎన్నికైన వారి చేతిలోనే ఎంత కాదన్నా ఎంతో కొంత అధికారం వుంటుంది. కానీ ఎమ్మెల్యేలు ఒకపార్టీ సర్పంచ్ లు మరో పార్టీ అయితే ఎలా వుంటుందో అని జనం భయపడితే, ఎన్నికలు రివర్స్ కొట్టే ప్రమాదం వుందని తెలుగుదేశం భయపడుతోంది. అందుకే పైకి ఎన్నికల కమిషన్ ముందు బీరాలు పోతోంది కానీ ఎన్నికలు ముందు పెడితే బెటరా? తరువాత అయితే బెటరా అన్న బెరుకు మాత్రం వీడడం లేదని రాజకీయ వర్గాల బోగట్టా.