ఒకవైపు జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. మొత్తం కార్యాచరణను పూర్తి చేసి.. ఇన్నాళ్లూ ఆర్టీసీ కార్మికులుగా ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నో యేళ్లు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ అది. పాదయాత్రలో జగన్ ఆర్టీసీ విలీనాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆ ప్రక్రియ మొత్తాన్నీ పూర్తి చేసి, న్యూ ఇయర్ ను ఆర్టీసీ కార్మికులకు మరపురానిదిగా చేశారు.
ఇక జనవరి రెండో వారంలో.. సంక్రాంతి కన్నా మనుపే.. అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభం కానుంది. పిల్లలను స్కూళ్లకు పంపే ప్రతి తల్లి ఖాతాలోకీ 15 వేల రూపాయల జమ చేసే ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ఏ క్లాస్ చదివే పిల్లలున్నా తల్లులు ఈ పథకం లబ్ధిదారులు కాబోతున్నారు. ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన అర్హుల జాబితాను రెడీ చేసింది ప్రభుత్వం. మొత్తం 42 లక్షల మంది తలల్లు ఖాతాలోకి డబ్బును జమ చేయనున్నారు. మరో పదమూడు లక్షల మంది జాబితాను పరిశీలిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
బహుశా దేశంలో ఎక్కడా ఈ తరహా పథకం అమల్లో లేదు. ఈ పథకంతో ఎక్కువగా లబ్ధి పొందేది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలే. ఈ నేపథ్యంలో వారిలోనే ఈ పథకం గురించి చర్చ జరుగుతూ ఉంది. జగన్ మాట ఇచ్చినప్పుడు ఎంతమంది ఈ పథకం పై ఆశలు పెట్టుకున్నారో కానీ, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్న నేపథ్యంలో మాత్రం పేద, మధ్య తరగతి మహిళల్లో జగన్ ఇమేజ్ బాగా పెరుగుతోంది. ఈ పథకం వారికి డైరెక్టుగా లబ్ధి చేకూరుస్తున్నది కావడంతో.. జగన్ పై వారి వారిలో ఆదరాభిమానాలు మరింతగా కనిపిస్తున్నాయిప్పుడు.