తెలుగుదేశం పార్టీ నేతల అసహనం పతాక స్థాయికి చేరుతూ ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో చిత్తు అయిన వీళ్లు ఇప్పుడు తమకు తోచినట్టుగా మంటలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తిక్క మాటలు మాట్లాడుతూ.. వీళ్లు తమ అసహనం ఏ స్థాయిలో ఉందో చాటుకుంటున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం నేత తిక్కారెడ్డి ఇలానే మాట్లాడారు. తమ ప్రాంతాన్ని కర్ణాటకలోకి కలపాలంటూ ఈయన మాట్లాడారు. జగన్ మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ తిక్కారెడ్డి.. తమ ప్రాంతాన్ని కర్ణాటకలోకి కలపాలన్నాడు. నిజానికి మూడు రాజధానులు ఫార్ములాతో కర్నూలుకు మేలు జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రజలు ఆశించినట్టుగా, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలుకు హై కోర్టు దక్కుతూ ఉంది. ఇది ఆహ్వానించదగిన అంశం. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. తమను తిక్క మాటలను ప్రజలు నమ్ముతూ ఉంటారనే భ్రమల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
అందుకే రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నేతలు కూడా.. చంద్రబాబు అమరావతి కలలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నారు. మరీ తెగించేసి.. తమ ప్రాంతాన్ని కర్ణాటకలోకి కలిపేయాలని ఈ తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. తన పేరుకు తగ్గట్టైన డిమాండ్ చేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఎన్నికల సమయంలో తిక్కారెడ్డి వార్తల్లో నిలిచారు. ఎక్కడికో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఏదో కాల్పులు చేయించి.. తన మీద దాడి జరిగిందంటూ ఈయన హైడ్రామా చేశారు. ఆ తర్వాత అసలు కథ బయటకు వచ్చింది. మంత్రాలయం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి చిత్తు అయిన ఈ తిక్కారెడ్డి ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలపాలని అంటున్నారు. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గి అలా మాట్లాడి ఉన్నా గౌరవంగా ఉండేదేమో!