మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం పుణ్యమా అని వైసీపీపై ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాని నుంచి బయట పడేందుకు జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. అమరావతి రాజధానిలో వైసీపీ తన ‘ఇంటి’ని చక్కదిద్దే అద్భుతమైన ప్లాన్ రెడీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నారనే వార్త సాదాసీదాగా కనిపించినా…దాని ఉద్దేశం చాలా లోతైంది. ఒక పక్కా వ్యూహం ప్రకారం జగన్ సర్కార్ రాజధానిలో అడుగులు వేస్తోంది.
రాజధానికి 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు తమ విలువైన భూములు ఇచ్చారు. దాదాపు 33 వేల ఎకరాలను నాటి చంద్రబాబు సర్కార్‌కు ల్యాండ్ ఫూలింగ్ పద్ధతిలో అందజేశారు. గత నెల 17న సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ఏర్పాటుపై సూచన ప్రాయంగా వెల్లడించినప్పటి నుంచి రాజధాని ప్రాంతంలో అలజడి చేలరేగింది. రాజధానికి భూములిచ్చిన వారు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో వ్యతిరేకతకు విరుగుడు ఆలోచించింది. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతం (సీఆర్‌డీఏ) పరిధిలోని 2,500 ఎకరాల్లో 39,559 మంది పేదలకు ఇంటి స్థలాల పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. విజయవాడ నగరం, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి పట్టణ ప్రాంతాలు, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన 39,559 మంది పేదలకు రాజధాని ప్రాంతంలో ఇంటి పట్టాలని ఇవ్వాలని నిర్ణయించడం వెనుక జగన్ సర్కార్‌కు ఓ పెద్ద వ్యూహం దాగి ఉంది.
ఇంటికి కనీసం ముగ్గురు ఓటర్లున్నా దాదాపు 1,18,677 మంది ఓటర్లను రాజధాని ప్రాంతానికి కొత్తగా తరలించినట్టవుతుంది. చేసిన సాయాన్ని పేదలు ఎప్పటికీ మరచిపోరని, వీరిలో కనీసం 60 నుంచి 70 శాతం మంది వైసీపీకి ఓట్లు వేస్తే చాలనే ఆలోచనతో ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. రాజధానిలో వ్యతిరేకతను వీరి ద్వారా భర్తీ చేసుకోవచ్చని సీఎం భావిస్తున్నారు.
రాజధానిపై ఇంటి స్థలాల పంపిణీపై సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో కలసి సమీక్షించారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని 13 గ్రామాల్లో 2,053 ఎకరాలు గుర్తించినట్టు సమాచారం. ఉగాదికి ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటోంది.