పవన్ కళ్యాణ్. విశాఖలో సినీ నటుడిగా శిక్షణ పొందారు. ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన సినీ అభిమాన జనం కూడా విశాఖలో ఎక్కువే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖ మీద ఎందుకో కానీ కనీస ప్రేమను కూడా చూపించడంలేదు. విశాఖ అంటే నాకు ఇష్టం అంటూ చంద్రబాబు మాదిరిగానే అపుడపుడు మాటలు చెబుతారు కానీ రాజధాని గా విశాఖ కాకూడదు అన్న టీడీపీ అజెండానే అనుసరించడం విడ్డూరం అని మేధావులు అంటున్నారు.
అమరావతి కౌలు రైతుల కోసం ట్వీట్లు ట్వీటే పవన్ విశాఖకు నాడూ నేడూ చంద్రబాబు చేసిన, చేస్తున్న అన్యాయం మీద మాత్రం ప్రశ్నించడంలేదని అంటారు. ఇక విశాఖకు రైల్వే జోన్ పేరుకు ప్రకటించి బీజేపీ అంతా చేసేశామని అంటోంది. కనీసం ఉన్న వాల్తేర్ డివిజన్ని కూడా ముక్కలు చేసి పారేసింది.
రైల్వే జోన్ అన్నది కాగితాల మీదనే ఉంది తప్ప రెండేళ్ళుగా ఒక్క అడుగు ముందుకు పడలేదు, మరి బీజేపీతో పొత్తు ఉన్న పవన్ విశాఖ రైల్వే జోన్ కి నిధులు ఇచ్చి ఆదుకోమని కోరడానికి మాత్రం ఒక్క ట్వీటూ వేయకపోవడం వింతల్లోకెల్లా వింతే మరి. విశాఖ అభివ్రుద్ధిని కట్టుబడి ఉంటామని మాటలతో బీజేపీ టైమ్ పాస్ చేస్తూంటే ఇక్కడ నుంచి పోటీ చేసిన పవన్ ఆ ఊసే ఎత్తరు. కానీ అమరావతి కౌలు రైతుల పక్షాన వకాత్లా పుచ్చుకుని తాను ఆమరావతి పక్షపాతిని అని నిరూపించుకుంటూనే ఉంటారు.
మరి విశాఖలో కరడుకట్టిన జన సైనికులు ఉన్నారు. వారికి ఈ ప్రాంతం మీద మమకారం ఉన్నా పవన్ తీరు బట్టి ఫుల్ సైలెంట్ అవుతున్నారు. ఏది ఏమైనా పవన్ వాస్తవాలు గుర్తించి విశాఖ ప్రగతి కోసం నాలుగు మాటలు మాట్లాడితే బాగుంటుంది అన్నది ఆయన ఫ్యాన్స్ తో పాటు అందరి కోరిక కూడా.