ఆర్ఆర్ఆర్.. రెంటికి చెడ్డ రేవడి

రాజకీయాల్లో ఎవరో వచ్చి మనల్ని నాశనం చేయరు. మనం తీసుకున్న నిర్ణయాలే మన రాజకీయ భవిష్యత్తును శాసిస్తాయి. ఛాప్టర్ క్లోజ్ అవుతుందా లేక పొలిటికల్ గా మైలేజీ వస్తుందా అనే విషయం తీసుకున్న నిర్ణయాలపై…

రాజకీయాల్లో ఎవరో వచ్చి మనల్ని నాశనం చేయరు. మనం తీసుకున్న నిర్ణయాలే మన రాజకీయ భవిష్యత్తును శాసిస్తాయి. ఛాప్టర్ క్లోజ్ అవుతుందా లేక పొలిటికల్ గా మైలేజీ వస్తుందా అనే విషయం తీసుకున్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.. సోషల్ మీడియాతో, మరీ ముఖ్యంగా పచ్చ మీడియాతో ఆర్ఆర్ఆర్ అని ముద్దుగా పిలిపించుకునే రఘురామ కృష్ణంరాజు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తను తీసుకున్న నిర్ణయాలతో తన రాజకీయ సమాధికి తానే గొయ్యి తవ్వుకుంటున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరవ్వాలనుకున్నారు రఘురామకృష్ణంరాజు. అనుకున్నదే తడవుగా వైసీపీతో కయ్యం పెంచుకున్నారు. ఆ పార్టీ నేతలపై, స్వయంగా అధినేత జగన్ పై ఇష్టారీతిన మాట్లాడారు. మొత్తానికి తను అనుకున్నది సాధించారు. ఆయనిప్పుడు అనధికారికంగా వైసీపీ మనిషి కాదు. కానీ సరిగ్గా ఇక్కడే పరిస్థితులు రఘురామ కృష్ణంరాజుకు అడ్డం తిరిగాయి.

వైసీపీతో సున్నం పెట్టించుకొని అనధికారికంగా బయటకొచ్చిన ఈ నేత, అదే సమయంలో బీజేపీకి దగ్గరవ్వలేకపోయారు. మరీ ముఖ్యంగా సోము వీర్రాజు సీన్ లోకి వచ్చిన తర్వాత రఘురామ లాబీయింగ్ కు గట్టి గండి పడింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పట్నుంచి ఎక్కడికక్కడ చెక్స్ పెడుతూ వస్తున్న వీర్రాజు, అదే ఊపులో రఘురామకృష్ణంరాజుకు కూడా పరోక్షంగా చెక్ పెట్టినట్టు కనిపిస్తోంది.

ఏపీ 3 రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వీర్రాజు ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అమిత్ షా త్వరలోనే ప్రకటన చేస్తారంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. ఇదొక్కటే కాదు.. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం జోక్యం చేసుకోదంటూ ఈమధ్య జీవీఎల్ నరసింహారావు ప్రకటిస్తే దీనిపై కూడా రివర్స్ స్టేట్ మెంట్ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. దీనికితోడు అమరావతిలో జరుగుతున్న ఉద్యమం, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి లాంటి అంశాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రఘురామ కృష్ణంరాజు విబేధిస్తున్నారు.

మొన్నటివరకు రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిని, అతడి వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్న రాష్ట్ర బీజేపీ.. ఇప్పుడు పూర్తిస్థాయిలో అతడిపై దృష్టిపెట్టింది. రఘురామ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేయడంతో పాటు.. ఇకపై ఆయన వ్యాఖ్యలపై స్పందించకూడదని కూడా నిర్ణయించింది. అంతేకాదు.. రీసెంట్ గా రఘురామ చేసిన వ్యాఖ్యలతో పాటు అతడిపై రాష్ట్ర బీజేపీ అభిప్రాయాన్ని కేంద్రానికి విన్నవించారు.

తాజా పరిణామాలతో కేంద్రానికి దగ్గరవ్వాలనుకున్న రఘురామ ప్రయత్నాలు, ఆశలకు చెక్ పడినట్టయింది. ఇటు వైసీపీకి పూర్తిగా దూరమై, అటు బీజేపీకి దగ్గర కాలేక.. రెంటికి చెడ్డ రేవడిలా మారారు ఈ నేత. ఆయన లోక్ సభ సభ్యత్వంపై వేటు పడుతుందా పడదా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఆయన రాజకీయ భవిష్యత్తు మాత్రం గాల్లో దీపంగా మారింది. 

బాలయ్య కోసం ఈ కథ రాసుకున్నా