తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రత్యక్ష సంప్రదింపులు కూడా మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. తాజాగా ఒక ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్లి భారతీయ జనతా పార్టీ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం.
ఆయనే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరును తట్టుకుని గెలిచిన వారిలో అనగాని ఒకరు. మోపిదేవి వెంకటరమణ మీద మంచి మెజారిటీతో విజయం సాధించారు అనగాని. అది కూడా వరసగా రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఉండటానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఫిరాయింపుకే ఆయన మొగ్గుచూపుతున్నారట. అందుకే ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారని సమాచారం. అయితే ఆయన ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదు. ఈ విషయంలో ఏపీ స్పీకర్ ఇప్పటికే ప్రకటన చేశారు. అందుకే బీజేపీ ఈ విషయంలో ఆచితూచి స్పందించనుందని సమాచారం. తెలుగుదేశం నుంచి వచ్చే ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి చేర్చుకోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.