ఇల్లలకగానే పండగైపోదు.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ధోరణి ఇదే సామెతను గుర్తుకు తెస్తోంది. పోలవరం పనులకు ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోకుండా పనులు కొనసాగించడానికి ఇచ్చే స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులను ఒకేసారి రెండేళ్లకు ఇచ్చేస్తూ.. అక్కడికేదో.. ప్రాజెక్టు పూర్తికి తామేదో మహోపకారం చేసినట్లుగా ప్రకాష్ జవదేకర్ బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తమాషా ఏంటంటే.. మొన్న మొన్నటిదాకా ప్రత్యేకహోదా అడగడం ద్వారా ఏపీ కోసం తాను పాటుపడిపోతున్నట్టు, ఆ తర్వాత దానికి నాగా పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం ఒక నాటకం ఆడగా, అది కూడా తన పుణ్యమే అన్నట్టు.. అన్ని విధాలుగానూ తాను రాష్ట్రం కోసం పరితపించిపోతున్నట్లు సన్మానాలు చేయించుకునే.. వెంకయ్యనాయుడు కూడా… ఈ స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులు రెండేళ్లపాటూ ఇవ్వడానికి కూడా వెనుక తానే ఉన్నట్లుగా క్రెడిట్ తీసుకునే పనిలో ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జీవరేఖ. అయితే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం అనే కంటితుడుపు చర్య తప్ప.. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం గురించి… కుములుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవడం గురించి కేంద్రం పట్టించుకున్నది మాత్రంలేదు. ఖర్చు చేసిన నిధుల్ని కూడా సక్రమంగా విడుదల చేయట్లేదు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు అయితే మరీ ముష్టి వేసినట్లుగానే ఉంటున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో… ప్రాజెక్టు పనులు కొనసాగడానికి కొన్ని లీగల్ కేసులు, అనుమతులు వంటివి ఆటంకం కలిగించకుండా ఇచ్చే ‘స్టాప్ ఆర్డర్’ను కేంద్రం ఈసారి కూడా పొడిగించింది. ఇన్నాళ్లూ ఏ ఏడాదికాయేడు ఒక్కొక్క సంవత్సరం పాటూ పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. ఈదఫా ఒకేసారి రెండేళ్లకు పొడిగించింది.
ఇలా రెండేళ్లకు ఒకేసారి ఇవ్వడం వల్ల ఒరిగే అదనపు ప్రయోజనమేం లేదు. కాకపోతే.. ఆయనే ఆ మేరకు ప్రకాష్ జవదేకర్ కు సూచించి, అలా రెండేళ్లకు ఆదేశాలు ఇప్పించినట్లుగా వెంకయ్యనాయుడు గురించి వార్తలు వస్తున్నాయి. జవదేకర్ కూడా… ఆ రకంగా మోదీ ఆంధ్రప్రదేశ్ మీద అపరిమిత దయతో ఉన్నాడన్నట్లుగా కబుర్లు చెబుతున్నారు.
నిజంగా ఏపీపై దయే ఉంటే ఈకాగితాల పర్వం కాదు.. నిధులపర్వంలో ఎంత చురుగ్గా ఉన్నారో చాటుకోవాలి. వెంకయ్య వంటి చిత్తశుద్ధి గల నాయకులు… అనుమతుల గురించి కాదు.. పుష్కలంగా నిధుల మంజూరు గురించి సూచించాలి.. ఆదేశించాలి.. ఒత్తిడితేవాలి. అలాచేస్తే తప్ప పోలవరం సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదు.