రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలను ఈ దేశం ఎపుడూ గుర్తుంచుకుంటూనే ఉంది. ఏ నిరసన తెలియచేయాలన్నా ఆయన విగ్రహానికే ముందు వినతిపత్రం ఇస్తారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటూ నిత్యం ప్రతీ వారూ ఎక్కడో ఒక చోట ఏదో వేదిక మీద మాట్లాడుతూనే ఉంటారు.
ఇంతటి మహనీయుడు అంబేద్కర్ పేరిట జిల్లా పేరు లేకపోవడం బాధాకరమని అంబేద్కర్ జిల్లా సాధన సమితి నేతలు అంటున్నారు. ఇక అంబేద్కర్ కి విశాఖ రూరల్ జిల్లాతో అనుబంధం ఉందని చెబుతున్నారు. అంబేద్కర్ తన జీవిత కాలంలో ఒకసారి అనకాపల్లిలో పర్యటించారని, అక్కడ ప్రజలతో ఆయన మమేకం ఆయ్యారని చెబుతున్నారు.
అందువల్ల విశాఖ రూరల్ జిల్లాగా ఉన్న అనకాపల్లికి అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమని వారు అంటున్నారు. ఇప్పటిదాకా అంబేద్కర్ పేరిట కమ్యూనిటీ హాల్స్ తప్ప మరి దేనికీ ఏ ఇతర ప్రాజెక్టుకు కూడా పేరు పెట్టలేదని దళిత సంఘాల నేతలు అంటున్నారు.
ఇపుడు అవకాశం వచ్చింది కాబట్టి అనకాపల్లి జిల్లాను అంబేద్కర్ జిల్లాగా చేస్తే బహుజనులు స్పూర్తి పొందుతారని, సంతోషిస్తారని అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి వినతులు స్వీకరించేందుకు కొత్త జిల్లాల నోటిఫికేషన్ ద్వారా ఈ నెల 26 దాకా సమయం ఇచ్చింది.
అందువల్ల బహుజనులు తమ డిమాండ్ సాకారం కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసు చేసుకోవాలని కోరుతున్నారు.