ఎన్నికల తరువాత షర్మిల పరిస్థితి ఏమిటి?

ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక, తెలంగాణ కోడలి అవతారం నుంచి వైఎస్ కూతురి అవతారంలోకి మారారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతగా కన్నా, జగనన్న సోదరిగా ఎక్కువ ప్రసంగాలు ఇస్తున్నారు. కుటుంబ గొడవలు అన్నీ…

ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక, తెలంగాణ కోడలి అవతారం నుంచి వైఎస్ కూతురి అవతారంలోకి మారారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతగా కన్నా, జగనన్న సోదరిగా ఎక్కువ ప్రసంగాలు ఇస్తున్నారు. కుటుంబ గొడవలు అన్నీ రోడ్డు మీదకు తెచ్చారు. జనాలకు క్లారిటీ షర్మిలనే ఇచ్చారు. ఆస్తి గొడవల నేపథ్యంలో అన్న చెల్లెలు చెరో వైపు వున్నారని. కానీ ఇక్కడ ఆడబిడ్డ అయినా కూడా షర్మిలకు ఎందుకో రావాల్సిన సింపతీ రావడం లేదు. బహుశా ఆమె తనంతట తాను జనాల్లోకి వచ్చి, రాజకీయాలు మాట్లాడకుండా, అన్న తనకు అన్యాయం చేసారు అని మొరపెట్టుకుని వుంటే అది వేరేగా వుండేది.

జగన్ ను జైల్లో పెట్టిన కాంగ్రెస్ లో చేరి, అన్న పాలన మీద రాళ్లేయడం వల్ల షర్మిల అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. మొదటి మూడు రొజుల్లో జరిగిన హడావుడి రాను రాను పర్సనల్ గొడవగా మారిపోయింది. షర్మిల స్పీచ్ లు జనాలు తప్పట్లు కొట్టడంతో సరిపోతోంది. ఒక్క నాయకుడు షర్మిలను నమ్ముకుని కాంగ్రెస్ లో చేరింది లేదు. వైకాపా వదిలితే తేదేపాలో చేరుతున్నారు, భాజపాలో చేరుతున్నారు తప్ప కాంగ్రెస్ లో కాదు.

సరే ఎన్నికలు వస్తాయి. షర్మిలను తోడు తీసుకుని చంద్రబాబు యుద్దం చేసి జగన్ మీద గెలవచ్చు. గెలవకపోవచ్చు. గెలవకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ అనేది మళ్లీ జనాలు మరిచిపోతారు. షర్మిల రాకముందు ఎలా వుందో అలా అయిపోతుంది. అప్పుడు షర్మిల పరిస్థితి ఏమిటి? లేదూ చంద్రబాబు గెలిచారు అనుకుందాం. అప్పుడు మాత్రం షర్మిల చేసేది ఏముంటుంది? వైకాపాలో మిగిలినవారు ఏమన్నా నేరుగా వెళ్లి కాంగ్రెస్ లో కలిసిపోతారా? కాదు కదా? మరింక అప్పుడు మాత్రం షర్మిల చేసేది ఏముంటుంది?

నా వల్లే కేసీఆర్ ఓడారు అని తెలంగాణలో చెప్పుకున్నట్లు ఆంధ్రలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పడానికి మినహా మరెందుకు వుండదు. కాదూ అంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని మంచి చేసుకుని, కర్ణాటక, తెలంగాణలో ఏవైనా పనులు జరిపించుకోవచ్చు. కానీ ఇక్కడో సమస్య వుంది. ఎప్పడు ఎన్నికలు జరిగినా, ఓడిపోయిన తరువాత సింపుల్‌గా పిసిసి అధ్యక్షులను తీసి పక్కన పెట్టడం అన్నది కాంగ్రెస్ కు అలవాటు. అది గమనించి షర్మిల ముందుకు వెళ్లాల్సి వుంటుంది.