Advertisement

Advertisement


Home > Politics - Analysis

2029 కి జనసేన భవిష్యత్ ?

2029 కి జనసేన భవిష్యత్ ?

2024 ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.  జనసేన పార్టీ ఆవిర్భవించి అప్పటికి పదేళ్లు దాటిపోతుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ సీరియస్ గా పోటీ చేసింది ఒకే ఒక ఎన్నికల్లో. గెలుచుకుని, చేజార్చుకున్నది ఒకే ఒక సీటు. స్థానిక ఎన్నికల్లో గుర్తు లేదు చాలా చోట్ల తెలుగుదేశంతో లోపాయికారీ పొత్తులే. తెలంగాణ లో పేరుకు పార్టీ తప్ప, అడుగు దాటింది లేదు. పోటీ చేసింది లేదు. 

ఇప్పుడు కూడా ఒంటరిగా ఎలాగూ పోటీ చేయదు. ఎందుకుంటే ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని కాదు. పార్టీని నిర్మించి, నిర్వహించే సత్తా, తీరుబాటు పవన్ కళ్యాణ్ కు లేదు. అందువల్ల ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి శృంగభంగమే. అందుకే ఏదో పార్టీ అండ కావాలి. భాజపా అండ వల్ల ఉపయోగం లేదు. వైకాపా దగ్గరకు రానివ్వదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీనే. అందువల్ల 2024 ఎన్నికలకు తెలుగుదేశంతో పొత్తు అనివార్యం.

సరే, 2024 తరువాత పరిస్థితి ఏమిటి? 2029 వరకు పార్టీ ఏ మేరకు నిలబడుతుంది. 2029 నాటికి ఒంటరిగా పోటీ చేసే స్థాయికి చేరుకోగలదా? ఇది అసలైన ప్రశ్న.  నిజానికి పవన్ టార్గెట్ అయితే అదే. కానీ పరిస్థితులు, పవన్ వ్యవహారశైలి అందుకు సహకరిస్తాయా? అన్నది చూడాలి.

2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచాడు అనుకుందాం. ఇక పవన్ పరిస్థితి ఏమిటి? సినిమాల సంగతి పక్కన పెడితే పార్టీని మరో అయిదేళ్లు ఇదే మాదిరిగా నడపడం అసాధ్యం. కానీ దానిని తట్టుకుని అయిదేళ్లు పోరు బాట సాగగలిగితే బాగుంది. లేదంటే ఇక జనసేన భవిష్యత్ ను మరిచిపోవచ్చు.

లేదూ…2024లో తెలుగుదేశం గెలిచింది అనుకుందాం. పొత్తు ధర్మంలో భాగంగా ఎన్నో కొన్ని సీట్లు జనసేన కూడా గెలుచుకుంటుంది అనుకుందాం. ఒకటో, రెండో మంత్రి పదవులు కూడా ఇచ్చారు అని లెక్కేద్దాం. ముఖ్యమంత్రి అయ్యేది అసాధ్యం. తీసుకునే లేదా ఇచ్చే ఇరవై ముఫై సీట్లతో సిఎమ్ పదవి వస్తుందని పవన్ వెనుక జేజేలు కొడుతూ తిరిగే ఫ్యాన్స్ అనుకోవాలేమో తప్ప, మెడమీద తలకాయ వున్న ఎవ్వరూ అనుకోరు.

అలా మంత్రి పదవి, కొద్ది మంది ఎమ్మెల్యేలతో, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ అయిదేళ్లు రాజకీయాలు చేయాలి. కానీ ప్రభుత్వాన్ని తిట్టకూడదు. విమర్శించకూడదు. అలా అయితే అయిదేళ్ల తరువాత మళ్లీ జగన్ కు చాన్స్ వచ్చే ప్రమాదం వుంది. అయిదేళ్లు ప్రభుత్వంలో వుంటూ ఏ యాక్టివిటీ లేకుండా వుంటే 2029లో పార్టీ పరిస్థితి ఏమిటి? అప్పుడు జంట పోరు అయినా ఒంటరి పోరు అయినా జనాల్లో స్పందన ఎలా వుంటుంది?

అదే కనుక 2024లో ఒంటరి పోరు చేస్తే అయిదో ఆరో స్థానాలు గెలుచుకునే అవకాశం వుంది. అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినా అయిదేళ్ల బలమైన పోరు బాట సాగిస్తే 2029లో అవకాశం రావచ్చు. అంటే 2024లో జనసేన తీసుకునే నిర్ణయాన్ని బట్టి 2029లో పరిస్థితి ఆధారపడి వుంటుంది. లేదూ..ఇలాగే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలుగుదేశం నీడన ఇలా ఎవరు ఏమనుకుంటే నాకేంటీ అనే టైపులో గడిపిస్తా అంటే ఏ గొడవాలేదు. కానీ పార్టీకి జనాలే మిగలకపోచవ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?