తొలిసారి ఇండియాలో ఆస్కార్ లైవ్ కు క్రేజ్

“ఆస్కార్ అవార్డుల సంరంభం.. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసే క్షణం..” ఇలాంటి హెడ్డింగులు చాలానే చూశాం. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే, ఓ సగటు తెలుగు ప్రేక్షకుడికి ఆస్కార్ పై ఆసక్తి అత్యల్పం. ఏదైనా సినిమాకు ఆస్కార్…

“ఆస్కార్ అవార్డుల సంరంభం.. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసే క్షణం..” ఇలాంటి హెడ్డింగులు చాలానే చూశాం. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే, ఓ సగటు తెలుగు ప్రేక్షకుడికి ఆస్కార్ పై ఆసక్తి అత్యల్పం. ఏదైనా సినిమాకు ఆస్కార్ వస్తే, టీవీలోనో లేదా మరుసటి రోజు పేపర్ లోనో చూసి ఓహో అనుకుంటాడు తప్ప, ఎక్సయిట్ అవ్వడు. ఎందుకంటే, ఆస్కార్ బరిలో భారతీయ సినిమాలు ఉండవు కాబట్టి, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు అస్సలు ఉండవు కాబట్టి.

కానీ ఇప్పుడు ఉన్నఫలంగా ఒక్కసారిగా ఆస్కార్ అవార్డుల వేడుకకు టాలీవుడ్ లో, తెలుగు ప్రేక్షకుడిలో ఉత్సుకత పెరిగింది. ఆసక్తి ఎక్కువైంది. దీనికి కారణం మన తెలుగు సినిమా ఆస్కార్ వేదికపై పోటీకి నిలవడమే. అందుకే ఎన్నడూ లేని విధంగా ఆస్కార్ అవార్డులు ఎప్పుడిస్తారు.. ఏ ఛానెల్ లో వస్తాయి.. ఇండియన్ టైమ్ ప్రకారం ఎన్ని గంటలకు.. లాంటి ఎంక్వయిరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరికొన్ని గంటల్లో ప్రారంభంకాబోతున్న ఆస్కార్ అవార్డుల వేడుక, తెలుగు ప్రేక్షకుడికి కూడా ఆనందాన్ని, ఇంకాస్త ఉత్కంఠను అందిస్తోంది. టాలీవుడ్ లో ఇలాంటి వేడి కనిపించడం, తెలుగు ప్రేక్షకుడు ఆస్కార్ వైపు ప్రత్యేకంగా తొంగిచూడడం ఇదే తొలిసారి.

95వ అకాడెమీ అవార్డుల వేడుక మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ప్రధాన ఆస్కార్ వేడుక మార్చి 12 న రాత్రి 8 గంటలకు లాస్ ఏంజిల్స్‌లో జరుగుతుంది. అయితే, భారతదేశంలో, అభిమానులు మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 13న ఈ వేడుకను చూడొచ్చు.

భారతీయ కాలమానం ప్రకారం, సోమవారం ఉదయం 5:30 గంటలకు ఆస్కార్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈవెంట్‌కు ముందు దాదాపు గంటపాటు రెడ్ కార్పెట్ వేడుక ఉంటుంది. ఈ షోను జిమ్మీ కిమెల్ హోస్ట్ చేయనున్నారు. ఇక ఇండియాలో ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని స్టార్ గ్రూప్ కు చెందిన కొన్ని ఛానెళ్లతో పాటు, ఓటీటీలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు.

ఈసారి ఆస్కార్ వేదికపై నాటునాటు పాటను లైవ్ గా పెర్ఫార్మ్ చేయబోతున్నారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి  ఈ పాటను ఆలపించబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేదికపై ప్రదర్శితమౌతున్న రెండో భారతీయ గీతంగా నాటు-నాటు చరిత్ర సృష్టించనుంది. ఇంతకుముందు 2009లో ఆస్కార్ వేదికపై రెహ్మాన్ భారతీయ గీతాన్ని ఆలపించాడు.

ఆర్ఆర్ఆర్ సంగతి పక్కనపెడితే.. ఈ ఏడాది అవార్డుల్లో ప్రత్యేకంగా 3 సినిమాలపై అందరిదృష్టి ఉంది. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా ఏకంగా 11 నామినేషన్లతో రేసులో ముందుండగా.. ది బన్షీష్ ఆఫ్ ఇన్ షెరిన్, ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ సినిమాలు చెరో 9 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. 8 నామినేషన్లతో ఎల్విస్ సినిమా మూడో స్థానంలో నిలిచింది. వీటిలో ఓ సినిమాకు ఎక్కువ ఆస్కార్స్ వస్తాయనే ఆసక్తికర చర్చ జోరుగా సాగుతోంది.