జగన్మోహనం: మాస్ విక్టరీకి మూడేళ్లు

సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు.. ఆంధ్రప్రదేశ్ లో సునామీ వచ్చింది. అది అలాంటిలాంటి సునామీ కాదు. ఓట్ల ప్రవాహం. ఆ సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ చరిత్ర…

సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు.. ఆంధ్రప్రదేశ్ లో సునామీ వచ్చింది. అది అలాంటిలాంటి సునామీ కాదు. ఓట్ల ప్రవాహం. ఆ సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ చరిత్ర పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కనివినీ ఎరుగని రీతిలో జగన్ ఘనవిజయం సాధించిన రోజు ఇది.

అన్నొస్తాడు..అన్నొస్తాడు.. అని ఎదురుచూసిన కోట్లాది మంది ప్రజల కల నెరవేరిన రోజు ఈరోజు. అందరూ ఊహించినట్టుగానే జగనన్న వచ్చాడు. చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని ప్రత్యర్థులకు రుచి చూపించాడు. వాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. అలా అన్నకు జనహారతి పడుతూ, చంద్రబాబును ఆంధ్ర రాజకీయాల నుంచి బహిష్కరించారు ప్రజలు. ఈ దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ కు మకాం మార్చుకున్నారు. అలా తను గెలవడమే కాకుండా, తనను నమ్ముకున్న వాళ్లందర్నీ గెలిపించారు జగన్.

151 సీట్లు.. ఫలితాలు వచ్చిన రోజు ఎలాగైతే అంతా ఆశ్చర్యపోయారో, ఇప్పటికీ చాలామందికి అదే ఆశ్చర్యం. ఇది ఎలా సాధ్యం అంటూ నియోజకవర్గాల వారీగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సమీక్షలు నిర్వహించుకుంటోందంటే.. జగన్ ఉప్పెన ఏ స్థాయిలో విరుచుకుపడిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని ఊపేసిన వైసీపీ ఫ్యాన్ గాలి అంటూ ఎల్లో మీడియా కూడా జగన్ పై తప్పనిసరి పరిస్థితుల మధ్య బ్యానర్ స్టోరీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొత్త మంత్రులు.. కొత్త కోలాహలం

అలా రికార్డు మెజారిటీతో గెలిచిన వైసీపీ, నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు మరోసారి పండగ చేసుకుంటున్నాయి. ఈసారి ఫెస్టివ్ కలర్ ఇంకాస్త ఎక్కువ కనిపిస్తోంది. దీనికి కారణం కొత్త మంత్రిమండలి కొలువుదీరడమే. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారి కొత్తగా మంత్రి పదవులు అందుకున్న నేతలు.. ఈ మూడేళ్ల వైసీపీ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంబరాల్లో పాల్గొనడానికి జగన్ రాష్ట్రంలో లేరు. ఆయన దావోస్ వెళ్లారు. అయినప్పటికీ శ్రేణులు తగ్గలేదు, సంబరాలు ఆగలేదు.

ఆగని సంక్షేమం.. కొత్త టార్గెట్

అయితే ఈ విజయంతో జగన్ పొంగిపోవడం లేదు. దీన్ని బాధ్యతగా తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ క్షణం వరకు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారు. నవరత్నాల్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఓవైపు పరిపాలన సాగిస్తూనే, మరోవైపు కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు.

2024 ఎన్నికల్లో తన రికార్డును తానే తిరగరాయాలని ఫిక్స్ అయ్యారు జగన్. ఈసారి అసెంబ్లీ స్థానాల సంఖ్యను మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీకి దిశానిర్దేశం చేశారు. వచ్చిన విజయంతో పొంగిపోకుండా, ఆ విజయాన్ని కొనసాగించేలా మరింత కష్టపడాలని సూచించారు.

చంద్రబాబులా ఫిరాయింపుల్ని ప్రోత్సహించకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తూ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న జగన్ కు 2024లో కూడా అఖండ విజయం తథ్యమని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. ఈసారి రికార్డుల రీసౌండ్ మరింత గట్టిగా ఉండబోతోంది. దుష్టచతుష్టయం కలిసినా, ఎల్లో మీడియా ఎన్ని కుతంత్రాలు పన్నినా.. జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరనేది అందరి మాట.