భారతదేశంలో కూడా విడాకుల రేటు క్రమంగా పెరుగుతూ ఉంది. గతంలో అంటే.. కనీసం నాలుగు దశాబ్దాల కిందటి వరకూ కూడా దేశంలో విడిపోయే భార్యాభర్తలు ఉండే వారు కానీ, అధికారిక విడాకుల కన్నా.. అప్పట్లో అనధికారికంగా విడిపోయే వారే ఎక్కువ! మగాడు రెండో పెళ్లి చేసుకుని భార్యను పుట్టినింటికి పంపేసినా అడ్డుకునే చట్టాలు అప్పుడు తక్కువే! ఇక కోర్టులకు కేసులు వేసి, మోసం చేసిన భర్తను నిలదేసేంతలా సమాజం ఉండేది కూడా కాదు!
అయితే ఆ పరిస్థితిలో ఆ తర్వాత మార్పు మొదలైంది. పాత కేసులు కూడా చాలా సంవత్సరాల తర్వాత కోర్టులకు ఎక్కాయి. అప్పటికే భర్త వదిలేసి, అతడు మరో పెళ్లి చేసుకుని పది, ఇరవై యేళ్లు అయిన వారు కూడా తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఎక్కడం మొదలైంది. ఈ కాలంలో అయితే విడిపోవడం చాలా వరకూ చట్టపరంగానే జరగాల్సిందే!
మరి విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంటుంది..? అంటే.. ఇది అలాంటి జీవితం అనుభవిస్తున్న వారే చెప్పాలి. ఒకటైతే నిజం.. గతంలోలా విడాకులు తీసుకున్న మహిళ అంటే విపరీతమైన చిన్నచూపు లేదు! కానీ అది పూర్తిగా పోలేదు. ఆఖరికి విడాకులు తీసుకున్న హీరోయిన్లనే సోషల్ మీడియాలో బాహాటంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎందుకు విడిపోయింది, వారి విడాకుల సెటిల్ మెంట్ ఏమిటి.. అనే విషయాలు తెలియకపోయినా, విడిపోయింది కాబట్టి ఆమెను నిందించడం లేదా, ఆమెను చిన్న చూపు చూసేలా కామెంట్లు పెట్టడం వంటివి సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి.
విడాకులు తీసుకున్న ఆడదంటే.. సమాజానికి చిన్నచూపు పోలేదనేందుకు సెలబ్రిటీల విషయంలో కనిపించే పోస్టులు కూడా తార్కాణం. మరి ఈ మొరుగుడుతో వారికి పోయేదేం లేదు. అయితే సమాజం ధోరణికి ఇలాంటివి ప్రతిబింబాలు.
మరి సెలబ్రిటీల గురించి ఇలాంటి కామెంట్లు వస్తున్నాయంటే, విడిపోయిన సాధారణ యువతి పై కూడా ఇలాంటి కామెంట్లు ఉండనే ఉంటాయి. ఆమె ఎందుకు విడిపోయిందో.. అని సన్నాయి నొక్కులు నొక్కుతారు బంధువులు. ఇలాంటి మాటలు కొన్ని సార్లు సూటిపోటిగా కూడా మారొచ్చు. అయితే ఈ రోజుల్లో విడాకులు తీసుకున్న అమ్మాయికి కూడా ఆ తర్వాత వివాహం చేసుకోవాలంటే పెద్ద కష్టంగా లేదు!
అమ్మాయిల కొరతో, అబ్బాయిల సంఖ్య ఎక్కవగా ఉండటమో ఏమో కానీ.. విడాకులు తీసుకున్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటామనే ఇంకా ఒక్కసారి పెళ్లి కాని అబ్బాయిలు కూడా చాలా మంది తయారయ్యారు! ఎలాగోలా పెళ్లి అయితే చాలనే ధోరణి ఇది! అయితే తాము ఆల్రెడీ విడాకుల నేపథ్యాన్ని కలిగి ఉండి, ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకును చేసుకుంటే ఆ తర్వాత లేని తలనొప్పులు వచ్చినా రావొచ్చని కొందరు విడాకులు తీసుకున్న అమ్మాయిలు, రెండో పెళ్లి అంటే విడాకుల తీసుకున్న వాడే అయ్యుండాలనే కండీషన్ కూడా పెట్టుకుంటున్నారు.
ఇలా సొసైటీ రెండు రకాలుగా స్పందిస్తోంది. చిన్నచూపు పోలేదు. అలాగని వారికి పూర్తి నిరాదరణ అయితే ఎదురుకాదు.
ఇక మానసికంగా అయితే కొందరు విడాకుల తర్వాత చాలా భారం దించుకున్నట్టుగా స్పందిస్తారు. వైవాహిక జీవితంలో ఏదో పెద్ద ఆటంకం ఏర్పడితేనే విడాకుల వరకూ వెళతారు కాబట్టి, ఇలాంటి విడాకులు లభిస్తే వారికి చాలా రిలీఫ్ గా అనిపించనూ వచ్చు. అప్పటి వరకూ బంధీగా ఉన్నామనే ఫీలింగ్ పోయి, స్వేచ్ఛ లభించినట్టుగా భావించవచ్చు.
అలాగే అంతా అయిపోయాకా.. దాంపత్యంలో తాము చేసిన పొరపాట్లకు కన్ఫెషన్స్ ఫీలయ్యే వాళ్లూ ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న గొడవలను పెద్దవి చేసుకుని విడిపోయామని, వాటిని ఆదిలోనే పరిష్కరించుకోవాల్సిందని, అప్పుడు కాస్త సర్దుకుపోవాల్సిందనే అభిప్రాయాలను వ్యక్తం చేసే డైవోర్సీలూ ఉన్నారు.
మరో కేటగిరిలో.. ఇక జీవితం సింగిల్ గా గడిపేయాలనే అభిప్రాయాలూ కొంతమంది నుంచి వ్యక్తం అయ్యాయి. అసలు తన మాజీ భర్త ను అతడి తల్లిదండ్రులే సరిగా పెంచలేదని, దీంతో అతడు చాలా దారుణమైన వ్యక్తిగా తయారయ్యాడని, అయినా అతడిని అతడి తల్లిదండ్రులు సమర్థించే వారని, అతడి నుంచి విడిపోయాకా.. జీవితంలో ఎనలేని ప్రశాంతత లభించిందనే అభిప్రాయాలూ కొందరు వ్యక్తం చేశారు.
పిల్లల పెంపకం, పని, తోబుట్టువులు, తల్లిదండ్రులు వీరితో తమ జీవితం విడాకుల తర్వాత ప్రశాంతంగా ఉందని కూడా కొందరు స్పష్టంగా చెప్పారు.