ఆలపాటిని కలవరాదా నాదెండ్ల గారూ!

తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుని ఈ ఎన్నికల్లో ముందడుగు వేయబోతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడం గురించి విడతలు విడతలుగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. చర్చలు జరుపుతున్నారు. జనసేన పార్టీ…

తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుని ఈ ఎన్నికల్లో ముందడుగు వేయబోతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడం గురించి విడతలు విడతలుగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. చర్చలు జరుపుతున్నారు. జనసేన పార్టీ నుంచి ప్రధానంగా ఈ సయోధ్య సమావేశాలకు నాదెండ్ల మనోహర్ నేతృత్వం వహిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో స్వయంగా భేటీ కావడం, మరో ఒకటిరెండు సందర్భాల్లో తప్ప.. ఇలాంటి భేటీలకు పవన్ కల్యాణ్ రావడం లేదు. మొత్తం సారథ్యం అంతా నాదెండ్ల చూసుకుంటున్నారు.

రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి మెలిసి పనిచేయడం గురించి నాదెండ్ల చాలా సుద్దులు చెబుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే విజయం సాధించగలం అని అంటున్నారు. సయోధ్య భేటీల్లో మాత్రమే కాకుండా.. విడిగా జనసేన కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో కూడా ఆయన తెలుగుదేశం కీర్తనలు ఆలపిస్తున్నారు. 

చంద్రబాబునాయుడు గారి పాలన దక్షత, అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నదని ఆయన సెలవిస్తున్నారు. అంతా బాగానే ఉంది… రెండు పార్టీలు ఐకమత్యంతో పనిచేయాలని చెబుతున్న నాదెండ్ల మనోహర్ ఆ సిద్ధాంతాన్ని తాను ఏ మేర ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు?

ఆయన తెనాలి సీటును తన సొంతంగా భావించుకుని ఆల్రెడీ ఎన్నికల ప్రచారం దిశగా కార్యకర్తల్ని ముందుకు నెడుతున్నారు. పవన్ కల్యాణ్ తో కూడా స్థాని కార్యకర్తలకు ఆ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇప్పించారు. అయితే.. తెలుగుదేశంతో పొత్తుల్లో ఆ సీటు జనసేనకు దక్కుతుందో లేదో తేలలేదు గానీ.. నాదెండ్ల మాత్రం రంగంలో దూసుకెళ్లిపోతున్నారు. అలాగని అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజాతో సయోధ్య కుదుర్చుకున్నారా? అంటే అది కూడా లేదు. ఆయన మరోవైపు నుంచి అక్కడ పోటీచేయబోయేది తాను మాత్రమే అని తెలుగుదేశం కార్యకర్తలతో చెప్పుకుంటున్నారు.

2019 ఎన్నికల్లో విజయం ఆలపాటి రాజాకు తృటిలో తప్పిపోయింది. నాదెండ్ల మనోహర్ సాధించినది కేవలం 30 వేల ఓట్లు మాత్రమే. అయినా సరే.. స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆలపాటి రాజా ను త్యాగం చేసి ఆయన సీటు తాను పొందాలని నాదెండ్ల కోరుకోవడం అతిశయమైన సంగతి. పోనీ, ఆయనకు తెనాలి తప్ప మరోచోట నెగ్గలేననే భయం ఉంటే కోరుకున్నారనే అనుకుందాం. 

కనీసం పొత్తుల సంగతి తేలిన తర్వాతనైనా ఆలపాటి రాజాతో సయోధ్య కుదుర్చుకుని ఉండాలి. అలా చేయకుండా.. చంద్రబాబు లెవెల్లో తాము చక్రం తిప్పగలం గనుక.. ఆలపాటి రాజాను ఖాతరు చేయను అని మంకుగా వ్యవహరిస్తే నష్టం ఆయనకే. 

చంద్రబాబునాయుడు.. పవన్ ను కాదనలేరు గనుక.. తెనాలిని నాదెండ్లకు కేటాయించవచ్చు గాక.. కానీ స్థానికంగా ఆలపాటి రాజా సహకారం లేకుండా ఆయన ఏం సాధిస్తారు? ఆదిశగా అడుగు వేయకుండానే.. ఆయన అందరికీ సుద్దులు చెప్పడం ఎందుకు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.