Advertisement

Advertisement


Home > Politics - Analysis

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులన్నీ, కత్తుల కౌగలింతలే!

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులన్నీ, కత్తుల కౌగలింతలే!

మిత్రులన్నాక ఎక్కువ తక్కువలు వుండకూడదు. అలా చూసుకుంటే మిత్రులే కాదు. ఈ ముక్క ఎకడన్నా అనవచ్చు. రాజకీయాల్లో అనకూడదు. ఎక్కువ, తక్కువలను ఎంచుకునే వారే అక్కడ మిత్రులు. కాకుంటే మిత్రుల్ని కాస్త పొడిగించి, వారిని మిత్ర పక్షాలు అంటారు. 

నాదే పై చేయిగా వుండాలనీ, నేనే ‘పెద్దన్న’గా వుండాలనీ ఈ మిత్రపక్షనేతలు అనుకుంటూ వుంటారు. అందుకే మిత్రుడిని ‘చిన్న’ బుచ్చటానికి వేసినన్ని వ్యూహాలు, శత్రువును జయించటానికి కూడా వెయ్యరు. 

రాజకీయాల్లో ఈ స్నేహబంధాన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. ‘పొత్తు’ ఒక పేరు. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి: ఎన్నికల ముందు పొత్తు, మరొకటి: ఎన్నికల తర్వాత పొత్తు. ఇది కాక ఇంకో పేరు వుంటుంది. ‘అవగాహన’. పైకి చెప్పరు కానీ, కలిసే వుంటారు. కానీ పైకి శత్రువుల్లా నటిస్తుంటారు అన్ని సీట్లలోనూ తమ సొంత అభ్యర్థులను పెడుతూ వుంటారు. కాకుంటే మిత్ర పక్షం గెలవాలనుకున్న చోట బలహీన అభ్యర్థిని బరిలో వుంచుతారు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే.

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, ఇలాంటి పై చెయ్యి పొత్తుల కోసం పార్టీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో విపక్ష పొత్తులూ, తెలంగాణ అధికార పక్ష పొత్తులూను. అంతే తేడా. 

ఎన్నోయేళ్ళుగా ‘పసుపు కుంకుమల’ కలిసిపోయినంతగా తెలుగుదేశం, బీజేపీలు కలసి వున్న విషయం జగమెరిగనిదే. కానీ, ప్రతీ ఎన్నికల్లోనూ ‘కుంకుమ’ రాలిపోయి, ‘పసుపే’ మిగులుతూ వస్తోంది. చూసి, చూసి బీజేపీకి విసుగు వచ్చింది. మనది పై చెయ్యి కాని స్నేహం మనకెందుకనుకున్నది. ‘వేరు పడాలని’ అనుకున్నది. కానీ ఈ రెండు పార్టీలను విడగొట్టటమంటే, ‘అవిభాజ్య కవలల్ని’ వేరు చేసినంత కష్టం. పైపైచ్చు, రెంటినీ అలా అతుక్కునే లా చేసింది వెంకయ్య నాయుడు లాంటి రాష్ట్ర బీజేపీ నేతలేనని అనుమానం లేక పోలేదు. సరే, ఎలాగూ వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గా ఒక పదవీకాలం పాటు చెయ్యటంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అప్పుడు బీజేపీ అధిష్ఠానానికి ఈ పని సులువయ్యింది. 

కానీ ఈ రెండు పార్టీలూ 2019 ఎన్నికలు తర్వాత ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చింది. జెండాలు వేరయినా ఎజెండా ఒకటేనన్న రీతిలో కనిపించినా, లోలోపల కత్తులు దూసుకున్నాయి. తర్వాత రెంటిలో ఏ పార్టీ పెద్దగా దూసుకు వెళ్ళింది లేదు. తర్వాత వచ్చిన ఎన్నికల్లో పరాజయాలనే చవిచూశాయి. అయితే  ఈ రెంటికీ మధ్యనే మరో పక్షం వుండి పోయింది. అదే పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని ‘జనసేన’. ఈ పార్టీ 2019 ఎన్నికల్లో ఒకే ఒక సీటును సాధించుకున్నా, ఆశ వదలుకోలేదు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడా తన ఉనికిని చాటుకుంది. తర్వాత జనసేన బీజేపీ పొత్తులోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు పొత్తు బీజేపీతో వున్నా, చూపు తెలుగుదేశం వైపే వుంది. వైసీపీ సర్కారు మీద కత్తికట్టాలంటే, టీడీపీకి చేరువ కావలసిందేనని సంకేతాల మీద సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఈ లోగా బీజేపీలోనుంచి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చి, తెలుగుదేశంలో చేరిపోయారు. 

ఇప్పుడు ఈ మూడు పక్షాలకూ `అనగా బీజేపీ, తెలుగు దేశం, జనసేనల మధ్య వున్నదేమిటి. ఈ మూడూ మిత్రపక్షాలయితే, కన్నా అంత కష్టపడి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి లాంగ్‌ జంప్‌ చెయ్యాల్సిన అవసరంలేదు. వీటిలో ‘పై చెయ్యి’ కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు వేసేది రెండే పక్షాలు: తెలుగుదేశం, బీజేపీ. ఎవరితోనయినా ‘తమ్ముడి’ స్థానంలో వుండిపోవటానికి ఎప్పుడూ సిధ్ధంగా వుండేది, ఉన్నట్లు కనిపించేదీ పవన్‌ కల్యాణే. అందుకు ‘రోడ్‌ మ్యాప్‌’లు ఇమ్మని పొత్తులో వున్న పక్షాన్ని అడగటమే పెద్ద సాక్ష్యం. 

కాకుంటే ఈ మూడు మిత్రపక్షాలూ కన్ను వేసింది ఒకే ఒక వోట్ల సమూహం మీద. అదే కాపు వోట్ల సమూహం. చంద్రబాబు 2019 కు ముందు అధికారంలో వున్నప్పుడు ‘చెల్లని చెక్కు’ లాంటి రిజర్వేషన్లను కాపులకు ప్రకటించారు. ఇది కేవలం ‘చెల్లని చెక్కు’ మాత్రమే, చెల్లదని తెలిసి కూడా చంద్రబాబు సర్కారు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన చెక్కు. అలా దూరం చేసుకున్న ఈ సమూహాన్ని తిరిగి దగ్గర చేసుకోవాలని సహజంగానే భావిస్తారు. కాబట్టే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తో లోకానికీ, మీడియాకీ తెలిసేలా చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలు కలసిపోయినట్లే. ఇక పొత్తే తరువాయి అనే స్థితి కనిపిస్తున్న తరుణంలో మరో కాపునేత కన్నా పసుపు కండువాకు ఒప్పుకున్నారు. ఆయనకు బాబు స్వాగతం పలికేశారు. ఇలా కొందరు కాపునేతల్ని ఇలా కలిపేసుకుంటే, కాపు వోట్లన్నీ వచ్చి పడిపోతాయా? ఈ కుల రాజకీయాలకు భౌగోళిక రాజకీయాలు అడ్డు పడతాయేమో?

చంద్రబాబు ప్రతిపక్షనేతగా తన పుణ్యకాలాన్నంతా ‘అమరావతిలోనే రాజధాని’ వుంచాలనే ఏకైక అంశం మీద వెచ్చించేశారు. దాంతో అమరావతి వల్ల తన సొంత సామాజిక వర్గంలోని కొందరు సంపన్నులకు మేలు కలగబోతుందనే ఆరోపణకు  (నిజమో, కాదో తర్వాత సంగతి.) ఊతాన్నిచ్చారు. ఉత్తరాంధ్రలోనూ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కాపు సామాజిక వర్గపు వోట్లు గణనీయంగా వుంటాయి. వైసీపీ సర్కారు ‘విశాఖ పట్నాన్ని’ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి, అక్కడ నుంచే పాలనను సడిపించటానికి సర్వసన్నధ్ధమవుతున్న తరుణంలో, అక్కడ వున్న కాపు సమూహాలు ‘రాజధానిగా అమరావతి’ ఎలా సమర్థిస్తాయి? 

ఇక తెలంగాణలో మిత్ర పక్షాలు బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌లు. వీరూ ఒకరి మీద ఒకరు పై చెయ్యి కోసం తాపత్రయ పడతారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సీటుకు జరిగే ఎన్నికల్లో అధిక శాతం కార్పోరేటర్ల వోట్లు మజ్లిస్‌ లో వుండి పోయాయి. కాబట్టి బీఆర్‌ఎస్‌ మజ్లిస్‌ అభ్యర్థిని ఎమ్మెల్సీని చెయ్యాలి. కాబట్టి ఈ విషయంలో ‘మజ్లిసే’ పెద్దన్నయ్య. అంతే కాదు. బీఆర్‌ఎస్‌ తనంతట తాను ఇప్పుట్లో పాతబస్తీ నుంచి ఒంటరిగా పోటీ చేసి, గెలవలేదు. ఎందుకంటే, బీజేపీని ను ఓడించటానికి బీఆర్‌ఎస్‌ కూడా ‘హిందూత్వ’ ఎజెండాను పైన పెడుతోంది. కాబట్టి, పాతబస్తీ నుంచి పొందే సీట్లు మజ్లిస్‌ ద్వారానే రావాలి. కాబట్టి మజ్లిస్‌ సైజులో చిన్నదయినా, బీఆర్‌ఎస్‌ పట్ల ‘పెద్దన్న’లాగే ప్రవర్తిస్తోంది. 

మిత్రబేధంలోనే, మిత్రలాభాన్ని చూడటమే పొత్తులో ప్రధాన లక్ష్యం. అదే రెండు రాష్ట్రాలోనూ జరుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?