సోనియాను ప్రశాంతంగా రిటైర్ కానివ్వరా?

టెక్నికల్ గా రిటైర్మెంట్ ప్రకటించినంత మాత్రాన.. సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోతుందని గానీ, మనవడు మనవరాలితో ఆడుకుంటూ కాలం గడుపుతుందని గానీ అనుకోలేం. భారత దేశ రాజకీయాలను ఆమె తుది శ్వాస వరకు శాసిస్తూనే…

టెక్నికల్ గా రిటైర్మెంట్ ప్రకటించినంత మాత్రాన.. సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోతుందని గానీ, మనవడు మనవరాలితో ఆడుకుంటూ కాలం గడుపుతుందని గానీ అనుకోలేం. భారత దేశ రాజకీయాలను ఆమె తుది శ్వాస వరకు శాసిస్తూనే ఉంటారని అందరికీ తెలుసు. అలాంటిది ఆమె.. ఏదో కాస్త విశ్రాంతిగా ఉండడానికి.. ఎన్నికల రాజకీయాల్లో పోటీపడుతూ తలబొప్పికట్టించుకోకుండా ఉండడానికి, సంబంధిత టెన్షన్లు తగ్గించుకోవడానికి.. రిటైర్మెంట్ ప్రకటన చేశారు. అయితే.. కాంగ్రెసు పార్టీలోని సోనియా భజనదళాలు మాత్రం ఆమెను ప్రశాంతంగా రిటైర్ కూడా కానిచ్చేలా లేరు. 

ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ తన రిటైర్మెంట్ ను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేయడం చాలా సంతృప్తిగా ఉందని, యూపీఏ పాలన తనకు జీవితంలో ఎంతో సంతృప్తి ఇచ్చిందని, రాహుల్ సాగించిన భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ప్రస్థానం ముగుస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడితో క్రియాశీల రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టే ఆ మాటల అర్థం. 

అయితే సోనియా రిటైర్మెంట్ ను సహించలేని అనేకమంది నాయకులు ఆమె మాటలకు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్ అధ్యక్ష స్థానం నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్టుగా, ఆ స్థానాన్ని ఇక ఆశించను అని సంకేతం ఇస్తున్నట్టుగా.. మామూలు రాజకీయాల్లో ఇంకా కంటిన్యూ అయ్యేట్టుగా ఆ మాటలకు భాష్యం చెబుతున్నారు. సోనియా వార్ధక్యం లోకి వచ్చేశారు. ఆమె వయస్సు ఇప్పుడు 76 సంవత్సరాలు. 

భారతీయ జనతా పార్టీలో 75 ఏళ్లు దాటిన నాయకుల్ని, వారు మహామహులైనా సరే, నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. అలాంటిది ఆమె ఈ వయసులో రాజకీయ ఆకాంక్షలతో సాగడం కష్టం. పైగా సోనియా వివిధ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఇన్నింటి మధ్య ఆమె క్రియాశీల రాజకీయాలను కొనసాగించడం సరైన ఆలోచనే కాదు. పైగా ఆమె వారసత్వాన్ని కొనసాగించడానికి కొడుకు రాహుల్ ఉన్నారు. ప్రియాంక కూడా కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కీలకంగా మారిపోయారు. తన పిల్లలిద్దరూ పార్టీకి అప్రకటిత చక్రవర్తుల్లాగా అధికారం చెలాయిస్తుండగా.. ఇక మళ్లీ ఆమె ఈ వార్ధక్యంలో భారం ఎందుకని అనుకుని ఉండవచ్చు.

కానీ కాంగ్రెస్ లో ఉండే భజన పరులు ఆమెను రిటైర్ కానిచ్చేలా లేరు. అలాంటి వారికి సోనియా భజన ద్వారా మాత్రమే తమ రాజకీయ మనుగడ అనే అభిప్రాయం భయం ఉంటుంది. సోనియా క్రియాశీలంగా లేకపోతే తమ పరిస్థితి ఏంటనేది వారి భయం. అందుకే ఆమెను ప్రశాంతంగా రిటైర్ కానివ్వకుండా రకరకాల భాష్యాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.