Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆర్కే…మీరు మారిపోయారు!

ఆర్కే…మీరు మారిపోయారు!

జగమెరిగిన కాలమిస్ట్ ఆర్కే. రాయడమే తప్ప వివరణ ఇవ్వడం, వివాదాలకు తల వంచడం అన్నది చాలా అంటే చాలా తక్కువ. అలాంటిది ఈవారం సగం కాలమ్ అంతా గత వారం తను రాసిన ‘ప్యాకేజ్ డీల్’ గురించే వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. గత వారం ఏమన్నారు…’ఆంధ్రలో విడిగా పోటీ చేస్తే ఎన్నికల ఖర్చు 1000 కోట్ల వరకు ఇవ్వడానికి తాను రెడీ‘ అని కేసీఆర్ ఓ డీల్ ను పవన్ కళ్యాణ్ కు పంపించారు అని కదా? దాని మీద ఇటు తేదేపా అటు జనసేన నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈవారం దానికి వివరణ ఇచ్చుకున్నారు. ఇది వివరణతో పాటు తను రాసింది సమర్థించుకునే ప్రయత్నం అన్నట్లు కూడా వుంది.

ఆర్కే కొంత మారారు అని ఈ వ్యాసం క్లారిటీ ఇస్తోంది. అది వాస్తవం. కొన్నాళ్ల క్రితం చిరంజీవి సినిమా మీద వ్యతిరేక సమీక్షలు రాయడం, వాటి మీద కూడా వెనక్కు తగ్గడం జరిగింది. మెగాస్టార్ ఇంటికి తన సిబ్బంది పంపించి, వివరణ ఇవ్వడం, ఆ తరువాత చిరు ఇంటర్వూను ఫుల్ పేజీ వేయడం, చిరుకు అనుకూలంగా వార్తాలు రాయడం ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోవడం జరిగింది. సిబ్బంది రాసినా, ఆర్కే రాసినా వచ్చింది ఆంధ్రజ్యోతిలో అంటే బాధ్యత ఆర్కేదే కదా? కానీ సిబ్బంది మీద నెట్టేసి, తను చేతులు కడుక్కున్నారు. అది వేరే సంగతి. కానీ మొత్తం మీద కాపులను కానీ కాపు ప్రముఖులను కానీ ఇప్పట్లో ఇబ్బంది పెట్టకూడదనే పాలసీతో ఆర్కే వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

కేసీఆర్-జగన్ మీద బాణం వేద్దామనుకుని వెయ్యి కోట్ల డీల్ అనే పెద్ద పదం వాడారు. అది వికటించడంతో ఈవారం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్లుంది. ఈ వ్యాసం తరువాత పవన్ కళ్యాణ్ అలిగారని, తనకు బహిరంగ క్షమాపణ చెప్పిస్తే తప్ప తాను తెలుగుదేశంతో కలిసి రాను అని తెగేసి చెప్పారని వార్తలు వినిపించాయి. ఆ నేపథ్యంలోనే ఈ వివరణ అనుకోవాలేమో? ఎందుకంటే దాదాపు ఓ సుదీర్ఘ పారాగ్రాఫ్ మొత్తం వివరణ అనే విధంగానే సాగడం విశేషం. అంటే ఈ సెగ ఆర్కేకు ఏ మేరకు తాకి వుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆర్కే కింద పడినా మీద పడ్డా అన్నట్లు చెప్పుకు వచ్చారు..

’’..ఎవరి విమర్శలకో, దూషణలకో భయపడి నేను ఈ వివరణ ఇవ్వడం లేదు. అపార్థాలు, అపోహలు చోటుచేసుకున్నప్పుడు వివరణ ఇవ్వడం సమంజసమని నమ్ముతున్నాను… ఇప్పటికైనా జన సైనికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. అలాకాకుండా పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మాత్రమే నేను గత వారం రాశాను అని ఇంకా భావిస్తే అది వారిష్టం…’’ అంటూ ముక్తాయించారు.

ఇంతకూ ఈ వ్యాసంలో దొర్లిన కొన్ని ఆణిముత్యాలను చూద్దాం.

‘’..చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఏ తప్పులు జరిగాయో, ఇప్పుడు కూడా అవే తప్పులు చేస్తున్నారు. తమ చర్యలు, ప్రకటనల ద్వారా జనసేనను ఒక సామాజిక పరిధికి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు…’’

అంటే జనసేన కాపుల పార్టీ గానే వుంటోది..ప్రజారాజ్యం బి పార్టీగా మారుతోంది అని ఆర్కే అంటున్నారని అర్థం చేసుకోవాలా?

‘’..వివిధ సందర్భాలలో నాగబాబు చేస్తున్న ప్రకటనలు ఇతర వర్గాలను జనసేనకు దూరం చేస్తున్నాయన్నది ఒక అభిప్రాయం..’’

అంటే జనసేనకు నాగబాబు ప్రకటనలు చేటు అన్నమాట.

‘’..చిరంజీవికి తమ్ముడు, పవన్‌ కల్యాణ్‌కు అన్న కాకపోతే నాగబాబు విమర్శలకు నేను స్పందించి ఉండేవాడిని కాదు..’’

అంటే నాగబాబుకు ఇండివిడ్యువల్ గా ఏ వెయిట్ లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసారనేగా.

‘’..వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని ఆ పార్టీలో ఓ వర్గం బలంగా కోరుకుంటున్నది. తెలుగుదేశం పార్టీతో జత కడితే పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కాలేరన్నది ఈ వర్గం అభిప్రాయం…’’

ఇది నిజమేగా..తెలుగుదేశంతో కలిస్తే చంద్రబాబు లేదా లోకేష్ సిఎమ్ అవుతారు కానీ పవన్ ఎందుకు అవుతారు?

‘’..పవన్‌ కల్యాణ్‌కు ప్యాకేజీ ఆఫర్‌ చేశారని కానీ, అందుకు ఆయన అంగీకరించారని కానీ నేను నా కాలమ్‌లో ఎక్కడా రాయలేదు. కేవలం కేసీఆర్‌ వ్యూహాలు మాత్రమే వివరించాను…’’

ఆఫర్ చేసారు అంటే అవతలివాడు తీసుకునే అవకాశం వుందనే భావన వుంటేనే కదా చేస్తారు?

‘’..కాపు సామాజికవర్గానికి చెందిన కొంతమంది ముఖ్యులు కూడా జనసేన ఒంటరిగా పోటీ చేసి 25 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటే పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, ఆయన చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నది నిజం కాదా? ..’’

వారు పోరనక్కరలేదు..అది కూడా పాయింట్ నే కదా?

ఇలా జనసేన పట్ల, మెగా ఫ్యామిలీ పట్ల ఇన్ని తన మనసులోని మాటలు చెప్పిన ఆర్కే ఎప్పటి మాదిరిగానే జగన్ మీద కూడా తన మాట చెప్పేసారు...’’చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా? పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతారా అన్నది మాకు అప్రస్తుతం. జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ గురించి మరిచిపోవచ్చు అని అందరూ అనుకుంటున్నట్టుగానే మేం కూడా భావిస్తున్నాం…’’

అంటే తనకు కావాల్సింది జగన్ సిఎమ్ కాకుండా వుండడం, ఇంక ఎవరు సిఎమ్ అయినా అనవసరం అని క్లారిటీ ఇచ్చేసారు. సంతోషం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?