గెలిస్తే ఈవీఎంల‌ను నిషేధించ‌గ‌ల‌రా..?

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీల‌కు ఈవీఎంల‌లో దోషం క‌నిపిస్తుంది. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఇదే క‌థ‌! అదే చంద్ర‌బాబు లాంటి వాళ్ల‌కు అయితే ఓట‌మి ముందుక‌నిపిస్తోందంటే ఈవీఎంల మీద ముందే నెపం మోపేస్తారు!…

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీల‌కు ఈవీఎంల‌లో దోషం క‌నిపిస్తుంది. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఇదే క‌థ‌! అదే చంద్ర‌బాబు లాంటి వాళ్ల‌కు అయితే ఓట‌మి ముందుక‌నిపిస్తోందంటే ఈవీఎంల మీద ముందే నెపం మోపేస్తారు! అదే అధికారం చేతిలో ఉన్నా, అధికారంపై దీమా ఉన్నా.. ఈవీఎంలు ఎంతో నాణ్య‌త‌తో, న్యాయంతో కూడుకున్న‌వి అనిపిస్తాయి. తేడా వ‌స్తే మాత్రం.. అబ్బే అమెరికాలో ఈవీఎంలు వాడుతున్నారా? మ‌న‌క‌న్నా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ ల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదా! అంటూ వాదిస్తారు!

వాస్త‌వానికి చంద్ర‌బాబు వీరాభిమానులు గ‌త ఎన్నిక‌ల‌నే బ్యాలెట్ పేప‌ర్ల మీద నిర్వ‌హించాల‌నే డిమాండ్లు చేశారు! గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మికి కార‌ణం కూడా ఈవీఎంలే అని వారు న‌మ్ముతుంటారు! అయితే చంద్ర‌బాబు ఈ విష‌యంలో కిక్కురుమ‌న‌డం లేదు నాలుగేళ్ల నుంచి! ఈవీఎంల‌ను నిర‌సిస్తే .. మోడీకి కోపం వ‌స్తుంద‌నేది చంద్ర‌బాబు భ‌యం! లేక‌పోతే 2019 ఎన్నిక‌ల‌కు వారం ప‌ది రోజుల ముందు వ‌ర‌కూ కూడా ఈవీఎంల‌ను నిర‌సించిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కిక్కురుమ‌న‌డం లేదు!  చంద్ర‌బాబు తీరు అలా ఉండ‌టంలో వింత లేదు.

కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఇంకా ఈవీఎంలు న‌శించాల‌నే నినాదం చేస్తూ ఉన్నారు! వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో కాంగ్రెస్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న విష‌యాల్లో ఈవీఎంలు కూడా ఉన్నాయ‌ట‌! మ‌రి ఇవ‌న్నీ కాదు.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల‌తో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గ‌లిగితే ఆ పై ఈవీఎంల‌ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ ఒక ప్ర‌క‌ట‌న చేయొచ్చుగా!

తాము గెలిస్తే.. ఆపై దేశంలో మ‌ళ్లీ ఈవీఎంలతోనే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామంటూ ప్ర‌క‌టించాలి కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల విశ్వ‌స‌నీయ‌త‌పై అనుమానం ఉంటే, ఒక‌సారి ఎన్నిక‌ల్లో గెలిస్తే చాలు ఆపై ఈవీఎంల‌కు సెల‌వు అని ప్ర‌క‌టించే ధైర్యం లేదా? లేదా ఈవీఎంలు ఉంటే తాము ఇక ఎన్న‌టికీ గెల‌వ‌లేమ‌ని అనుకుంటున్నారా! అలాంట‌ప్పుడు కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో అయినా కాంగ్రెస్ కు కొద్దోగొప్ప సానుకూల ప‌లితాలు వ‌స్తున్నాయి క‌దా! వాటిల్లో ఈవీఎంల ట్యాంప‌ర్ సాధ్యం కావ‌డం లేదా?

అయితే ఇలా ఆడ‌లేక మ‌ద్దెల ఓటిది అన‌డం కాంగ్రెస్ తీరే కాదు, గ‌తంలో బీజేపీ వాళ్లూ ఇలానే మాట్లాడారు. 2009లో ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ వాళ్లు ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారంటూ బీజేపీ నేత‌లు, నాటి జ‌న‌తా పార్టీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి లాంటి వాళ్లు పెద్ద క్యాంపెయినే న‌డిపించారు. ఈవీఎంల‌ను నిషేధించాలంటూ తెగ ఉద్య‌మాలు చేశారు. బీజేపీ కేంద్రంలో నెగ్గ‌గానే మ‌ళ్లీ వారి నుంచి ఇలాంటి మాట‌ల్లేవ్!